భూ పోరాటాలకు శ్రీకారం
నెల్లూరు, జూలై 5 (ఎపిఇఎంఎస్): జిల్లాలోని ఎస్పీ, ఎస్టీలకు చెందిన భూములను పెత్తందారులు ఆక్రమించిడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటానికి గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈమేరకు ఆ సంఘం కార్యదర్శి సి.హెచ్ ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులోభాగంగా గురువారంనాడు జిల్లాలోని కావలి, దగదట్టి, నెల్లూరు గ్రామీణం, వెంకటాచలం, చిల్లకూరు, వెంకటగిరి, దోరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాలలో భూపోరాటాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఎస్పీ, ఎస్టీలను సంఘటితం చేసి భూస్వాముల ఆధీóనంలో ఉన్న భూములలో ఎర్రజండాలు పాతడం ద్వారా ఈ భూములను తామే దున్నుకుంటామని అన్నారు. ఇదిలా ఉండగా గురువారం నుంచి ప్రారంభం కానున్న భూపోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంలో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.