భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం

3

రైతు సన్నాహక ర్యాలీ ప్రతినిధులతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌18(జనంసాక్షి):  భూసేకరణ ఆర్జినెన్సుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని రైతుసంఘాల నేతలతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ఉదయం వివిధ రైతుసంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే  రైతుర్యాలీకి సన్నాహకంగా  వివిధ రాష్టాల్ర నుంచి వచ్చిన వివిధ రైతు ప్రతినిధులు రాహుల్‌ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. రాజస్థాన్‌,  పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో భూసేకరణ సవరణ బిల్లుపై చర్చించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వ భూసేకరణ సవరణ బిల్లు, రైతు, పేద ప్రజల వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌  పార్టీ ఆదివారం కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ ర్యాలీ తలపెట్టిన సంగతి తెలిసిందే. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు చెందిన కిసాన్‌ కేత్‌ మజ్దూర్‌ సంస్థ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ క్రమంలోనే రైతు నేతలతో రాహుల్‌ తన కార్యాలయంలో సమావేశమై భూసేకరణ బిల్లుపై చర్చించారు. భూసేకరణ బిల్లును కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. రేపు రాంలీలా మైదానంలో నిర్వహించబోయే భూసేకరణ బిల్లు వ్యతిరేక ధర్నాలో రాహుల్‌, సోనియాగాంధీ మాట్లాడనున్నారు.