భూ సేకరణపై బహిరంగ చర్చకు రండి..అన్నా హజారే

2

పుణె,మార్చి26(జనంసాక్షి):   భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం సిద్ధిలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారని అయితే వారెవరితోనూ తాము మాట్లాడదలుచుకోలేదని తెలిపారు. స్వయంగా నరేంద్ర మోదీ చర్చకు వచ్చి ప్రజల సందేహాల్ని నివృత్తి చేయాలన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లుపై బహిరంగ చర్చకు రావాలని అన్నాహజారే డిమాండ్‌ చేశారు. వివాదాస్పదంగా మారిన భూసేకరణ బిల్లులో ఉన్న అభ్యంతరాలపై చర్చలు జరుపుతామని నితిన్‌గడ్కరీ పేర్కొన్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ విషయమై  మాట్లాడుతూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చలంటే పరిపూర్ణంగా ఉండదని అన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యక్ష ప్రసారంలో బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. బహిరంగంగా చర్చించటం వల్ల సవరణ చట్టం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో..ఎటువంటి నష్టాలు ఎదురవుతాయో ప్రజలు తెలుసుకునే వీలుంటుందని అన్నారు.