భూ సేకరణ సమస్యగా మారారాదు
భూసేకరణ,రైతుల సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దీనిపై విస్తృతమైన ప్రజాభిప్రాయం రావడం కష్టంగా ఉంది. అయితే కార్పోరేట్ కోసం వెంపర్లాడుతున్న ప్రభుత్వాలు కేవలం వారి ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నాయి. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇది ఓ రకంగా వ్యవసాయరంగాన్ని దెబ్బతీసుకునే వ్యవహారంగా మారుతోంది. ఇక్కడ ప్రయోజనాలు రైతులకన్నా దానిని అనుభవించే వారికే ఎక్కువగా ఉన్నాయి. అందుకే చట్టాలను కూడా కార్పోరేట్లకు అనుకూలంగా చేస్తున్నారు. ప్రధానంగా ఎపిలో అమరావతి కోసం భూసేకరణ పెద్ద సమస్యగా మారిన దశలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూమిని సేకరించారు. ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఏవిూ జరగలేదు. ఇది కేవలం పైకి కనిపించేంత స్మూత్‌గా సాగిపోలేదు. రైతులను నయానాభయాన బెదరించి సేకరించారు. ఎందరో దీనిని వ్యతిరేకించారు. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ సొతం నియోజకవర్గంలో మల్లన్న సాగర్ విషయంలోనూ ఆందోళన సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి 35వేల ఎకరాలకు భూమిని అక్కడి ప్రభుత్వం సులభంగానే సేకరించిందని చెప్పుకుంటున్నా రైతులకు ప్లాట్లు, పరిహారం ఇవ్వడంలో కొర్రీలు ఉండనే ఉన్నాయి. అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా పసెద్దగా సమస్యలు రాకుండా పంటలు పండే భూములను సైతం సేకరించడం విశేషం. అయితే, ఏపిలో పవన్ కళ్యాణ్ లాంటి వారు వెళ్ళినా పెద్దగా ప్రయోజనం జరగలేదు, రైతులు తమ భూములను కొత్త రాజధాని కోసం బాగానే వదులుకున్నారు.కానీ తెలంగాణలో భూసేకరణ సమస్య పెద్ద ఆందోళనకు దారి తీసేదిగా మారింది. అక్కడ బిజెపితో సహా అన్ని పార్టీలు అందోళనకు దిగాయి. వీరంతా సిఎం కెసిఆర్‌పై నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యే వారిని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. జివో ప్రాకారమా లేక భూసేకరణ చట్టం కింద ఏది యోగ్యమో అది చేయాలని అధికారులను ఆదేశించారు. భూ నిర్వాసితులకు అందించాల్సిన పరిహారం, రిజర్వాయర్ల నిర్మాణానికి అసరమయ్యే భూసేకరణ తదితర అంశాలపై స్పస్టత ఇచ్చారు. అయినా విపక్షాలు ఇంకా ఆందోళనచేస్తూనే ఉన్నాయి. కారణం వారికి ఏదో ఒక సమస్యకావాలి. దానిని కొనసాగించాలి. దానిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలి. అందుకే మల్లన్న సాగర్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి ప్రాజెక్టులు కడతామని, ఎక్కువ ముంపు లేకుండానే రీడిజైన్ చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణం కోసం కొంత ముంపు తప్పదని సిఎం అంటున్నారు. అలాంటి ప్రాంతాల్లో భూ నిర్వాసితుల కోసం పక్కాగా ప్రణాళిక వేశారు. నిర్వాసితులు కోల్పోయే వ్యవసాయ భూమికి, ఇల్లు- పశువుల కొట్టం- చెట్లు తదితర ఆస్తులకు, కొత్త ఇంటి నిర్మాణానికి మూడింటి చెక్కలను ఒకేసారి నిర్వాసితులకు అందివ్వాలన్నారు. ఏక మొత్తంలో డబ్బులు ఇవ్వడం వల్ల నిర్వాసితులు తమకిష్టమొచ్చిన రీతిలో ఇష్టమొచ్చిన ప్రాంతంలో స్ధిరపడే అవకాశం కలిగేలా చూస్తున్నారు. స్థానికంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వాసితులతో మాట్లాడి అవసరమైన భూ సేకరణ పూర్తి చేయాలని అన్నారు. విపక్షాల ఆందోళనకారణంగా తెలంగాణలో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా అంత సులభం కావడం లేదు. భూములు ఇచ్చేందుకు రైతులు పెద్దగా ముందుకు రావడం లేదు. 2013 నాటి భూ సేకరణ చట్టానికి చేసిన మార్పులకు సాధ్యమైనంత త్వరగా చట్టరూపం ఇవ్వడానికి బిజెపి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భూ సేకరణ చట్టం విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, ప్రజాస్వామ్య
విలువలను తుంగలో తొక్కుతూ ఏకపక్షంగా అన్న రీతిలో ప్రవర్తిస్తోందని విపక్షాలు విమర్శలు విమర్శలు చేయడంతో దీనిపై కేంద్రం వెనక్కి తగ్గింది. మార్కెట్ విలువ ఇచ్చేలా భూసేకరణ విధానం ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే సెజ్‌ల పేరుతో వేలాది ఎకరాలను ధారాదత్తం చేశారు. ఆనాడు వైఎస్ ప్రబుత్వం ఇలా అడ్డంగా దోచుకున్న సంగతి తెలియంది కాదు. ఇప్పుడు ఎపిలో కూడా రాజధాని కోసం వేలాది ఎకరాల భూసేకరణపైనా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పచ్చని పంటపొలాలలను అప్పనంగా తీసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఈ అనుమానాలు లేకుండా పారదర్శకంగా భూసేకరణ ఉండాలి. పరిశ్రమలకు లేదా కార్పోరేట్ల కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టే విదానం పోవాలి. ఎవరికి భూములు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కునేలా మాత్రమే ప్రభుత్వం పనిచేయాలి. అలా చేయకపోవడం వల్లనే భూ సేకరణకు వ్యతిరేకంగా రైతాంగం గళం విప్పుతోంది. వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వృత్తిదారులు ఆందోళనలకు దిగుతున్నారు. అనేక ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలూ నిరసనలు తెలుపుతున్నాయి. భూ సేకరణ జరిపే ప్రాంతాల్లో 70 శాతం రైతుల సమ్మతి తప్పనిసరని, రైతులు సంతృప్తి పడేలా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులతో పాటు ఉపాధి కోల్పోయే ప్రజానీకం అందరికీ పరిహారం చెల్లించాలని కోరుకుంటున్నారు. భూ సేకరణతో వచ్చే పర్యావరణ సమస్యలు, సామాజిక ప్రభావ నివేదికలను గ్రామసభల్లో బహిరంగ పరిచాలి. చట్టం ప్రకారం బంజరు భూములు, నీటి వసతులు లేని భూములు, సాగుకు సాధ్యం కాని భూములను మాత్రమే సేకరించాలి. ఇందులో కార్పోరేట్ ప్రయోజనాలకన్నా దేశ రైతు ప్రయోజనాలు ముఖ్యంకావాలి. గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతులు, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు రావాలి. అప్పుడే భూ సేకరణ వ్యవహారాలు బెడిసి కొట్టవు.