మండల కేంద్రంలో 20వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

నిరాహార దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు…

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 20వ రోజుకు చేరుకున్నాయి.
ఈరోజు దీక్షలో కాంగ్రెస్ పార్టీ నుంచి దీక్షలో నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ, మండల మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ మైపా మణి, భాగే వెంకట్రావు, కువారపు వెంకటేష్, కుమ్మరపల్లి ఉమాదేవి, బత్తుల వెంకట నర్సమ్మ, మద్దేటి రమణ, బర్ల లక్ష్మి, బర్ల రాణి, బర్ల సంధ్య, మేక కుమారి, బర్ల లక్ష్మమ్మ, చిప్ప మాణిక్యమ్మ, ఆరవ వీరయ్య, చందు నరేష్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి వరద ముంపు ప్రాంతాలకు కు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జే ఏ సి కన్వీనర్ కే వి రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ బూర్గంపహాడ్ గ్రామం గోదావరి, కిన్నెరసాని నదులకు మధ్యలో ఉండటం వలన గ్రామం తీవ్ర ముంపునకు గురవుతున్నదని, అందువలన బూర్గంపహాడ్ కు కరకట్ట వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా మాత్రమే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన భద్రాచలం కేంద్రంగా ముంపు ప్రాంత వాసులకు మెట్ట ప్రాంతాల్లో 2016 గృహాలు నిర్మించి ఇస్తామనడం తద్వారా మిగిలిన బాధితులకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ ముంపు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలయ్యేలా ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కన్వీనర్ కే వి రమణ ప్రభుత్వానికి పత్రికా ముఖంగా విన్నవించుకున్నారు.
దీక్షలో పాల్గొన్న వారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెల్లంకొండ వాసుదేవరావు, ఎల్లంకి రామకృష్ణ, ఎస్కే చోటే, బెల్లంకొండ ప్రసాద్, మందా నాగరాజు, సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సామాజిక న్యాయవేదిక జిల్లా అధ్యక్షులు కోడి బోయిన రవి తదితరులు సంఘీభావం ప్రకటించి ఉద్యమానికి అండగా ఉంటామని తెలియజేశారు.