మండుతున్న ఎండలకు మనదెంత బాధ్యత

మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలు తొలకరి చినుకుల ఉపశమనం కోసం ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నారు. కేరళను తొలకరి పలకరించినా మనకు మరో వారం రోజులపాటు ఎండలు తప్పేలా లేవని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రోహిణి కార్తిలో ఎండతాకిడికి రోకళ్లు పగులుతాయని పెద్దలు చెప్పిన మాట నిజంగా కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లుగా కన్పిస్తుంది. రోహిణికార్తె కారణంగా వెనకటికి మనపెద్దలు చెప్పినట్లుగానే ఎండలు దంచికొడుతున్నాయి. నిజానికి ఇదంతా మన స్వయంకృతం కాక మరోటి కాదు. చెట్లను అడ్డదిడ్డంగా నరికేఇ, కొండలను పిండి చేసి ప్రకృతి విధ్వంసానికి పూనుకున్న పాపానికి ఫలితం అనుభవిస్తున్నాం. వాగులు వంకలు లేకుండా చేసుకున్నాం. ఎక్కడా కనుచూపు మేరలో చెట్టు కనిపించకుండా ఎడారి చేసుకున్నాం. రోడ్డుపై వెళుతుంటే గతంలో సేదదీరేందుకు చెట్లు కనినించేవి. కానీ ఇప్పుడవి కాలగర్భంలో కలసి పోయాయి. దీనికితోడు పర్యావరణ విధ్వంసక చర్యలతో మనకు మనమే ముప్పు తెచ్చుకుంటున్నాం. విపరీతంగా ప్లాస్టిక్‌ వాడకం కారణంగా భూమిలో తేమలేకుండా పోతోంది. విచ్చలవిడి బోర్ల తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అలాగే భూమిలో నీరు ఇంకే ప్రయత్నాలు చేయడం లేదు. వాగులను మాయం చేశాం.చెరువనలు కబ్జా చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధ్వంసక చర్యలకు మనమే కారణమయ్యాం. మనం బాగుపడితే చాలన్న ధోరణి కారణంగా భవిస్యత్‌ తరాలకు మంచి వాతావరణం ఇవ్వలేకుండా పోతున్నాం. ఇలాగే విధ్వంసక చర్యలు కొనసాగితే మన మనుగడ కష్టమే. మనం చేసిన అకృత్యాల వల్లనే రోహిణి ప్రవేశంతో భానుడు భగ్గుమంటూ ఠారెత్తిస్తు న్నాడు. కొద్దిరోజులుగా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చి మొదట్లోనే మొదలైన భానుడి భగభగలు ఏప్రిల్‌లో కొనసాగగా మే చివరి వారంలో తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. అకాల వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పులతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో మొన్నటి వరకు జనం ఊపిరిపీల్చుకున్నారు. అయితే నాలుగు రోజులుగా మళ్లీ ఎండలు మండి పోతుండగా..పగలు..వేడిగాలులతో భానుడు సెగలు కక్కుతున్నాడు.  మధ్యాహ్నం భగభగ మండుతున్న ఎండని చూసి ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు. మే ముగింపు దశకు రావడంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండతీవ్రత కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. వారం రోజలుగా 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌ గా ఉన్న పగటి ఉష్ణోగ్రతలు మూడురోజుల నుంచి ఒక్కసారి 40 నుంచి 42 డిగ్రీలకు చేరుకుంటే బుధవారం రికార్డుస్థాయిలో 44.4 డిగ్రీలుగా నమోదైంది. దీంతో సామాన్య ప్రజలు ఉక్కపోతను తట్టుకోలేక పోతున్నారు. రానున్న ఐదారు రోజుల్లో రికార్డు స్థాయికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.  పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్న నేపథ్యంలో గ్రామాల లోని వ్యసాయ కూలీలు జాగ్రత్తలు వహించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత స్పష్టంగా
కన్పిస్తుండటంతో వ్యవసాయ కూలీలు ఉదయం 7 గంటలకే పనుల్లో నిమగ్నమవుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఇంటి ముఖం పడుతున్నారు. ఉపాధిహావిూ కూలీ పనులు ఊపందుకోవడంతో రైతులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటూ తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు.  రోడ్లపైకి ఎండకు రావాలంటే భయం వేస్తుంది. అత్యవసర పరిస్థితులలో రుమాలు కట్టుకుని వస్తున్నాం. వడగాలులకు తట్టుకోలేక ఇంటి వద్దనే ఉంటున్నాం. తొలకరి చినుకులు పడి వాతావరణం చల్లగా అయితే ఆరోగ్యాలు బాగుంటాయి.ఎండలు తీవ్ర రూపం దాల్చుతుండటంతో రోడ్లన్ని పగలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు
సతమతమవుతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగమంటూ  తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో గ్రామాలలోని జనం విలవిల్లాడుతున్నారు. బయటకు రావలంటేనే జంకుతున్నారు. వేడికి తాళలేక వృద్ధులు చంటిపిల్లలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమాదు అవుతుండటంతో తీవ్ర ఎండలతో వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్‌ నెల కంటే మే నెలలో అధికంగా ఎండలు ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వానల కోసం ఎదురు చూస్తున్నారు. మూగజీవాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. చెరువులలో, కుంటలలో నీరు పూర్తిగా చివరిస్థాయికి చేరడంతో గేదేలకు, ఆవులకు, జీవాలకు తాగునీరు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నాయి. జీవాలు సైతం ఎండకు మేతకు వెళ్లలేక చెట్లకిందనే సేదతీరుతున్నాయి. తప్పనిసరి పరిస్థితిలో అయితే టోపి, రుమాలు చుట్టకొని, కళ్లకు అద్దాలు పెట్టుకుని, హెల్మెంట్‌ ధరించి బయటకు వస్తున్నారు. కొబ్బరిబోండాలు, పండ్ల రసాలు, శీతలపానీయాలు, నిమ్మరసం, కీరదోస తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా మూరుమూల గ్రామాలలో ప్రజలు చెట్ల కింద సేదతీరుతూ ఇంటిలో తయారు చేసుకున్న జొన్న గడక, మజ్జిక సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపుడుకుంటున్నారు.  ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూలర్లను ఆశ్రయిస్తుండగా, ఉన్నతశ్రేణి వర్గాలు ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఉపాధిహావిూ కూలీలతో పాటు ట్రాక్టర్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీల పరిస్థితి అత్యంత దయనీయగా మారింది. ఈ ప్రతికూల పరిస్థితులు మారాలంటే మనమంతా ప్లాస్టిక్‌ వినియోగం మానాలి. నీటిని భూమిలో ఇంకేలా చేసే ప్రయత్నాఉల ముమ్మరం చేయాలి. అలాగే నిరంతరంగా మొక్కల పెంపకం చేపట్టాలి. విచ్చలవిడిగా బోర్లు తవ్వి భూగర్బ జలాలు అడుగంటకుండా చేయాలి. అలా ఓ పదేళ్లు శ్రమపడితే తప్ప కొంత మార్పు రాదు. అందుకు ఇప్పటినుంచే కదలుదాం.