మతోన్మాదం దేశానికి ప్రమాదకరం

12
నాడు చాయ్‌వాలా.. నేడు 10లక్షల సూట్‌వాలా

సీపీఐ రాష్ట్ర మహాసభల్లో సురవరం సుధాకర్‌రెడ్డి

ఖమ్మం, మార్చి7(జనంసాక్షి): దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాదులను అరికట్టాలని, అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా సర్దార్‌ పటేల్‌ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో పది జిల్లాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ ఎన్నికల ముందు నరేంద్రమోదీ ధరలు విపరీతంగా పెరిగాయని, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకురావడంపై ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ధరల అదుపునకు ప్రధాని అయ్యాక మోదీ ఏం చర్యలు తీసుకున్నారో, నల్లధనం మాట మళ్లీ ఎందుకు ఎత్తడంలేదని సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారిలో సగం మంది కాంగ్రెస్‌కు, మిగతా సగంమంది భాజపాకు విరాళాలు ఇచ్చారని ఆరోపించారు. రేషన్‌ కార్డులు తగ్గించాలని, పారిశ్రామిక చట్టాలను సవరించాలని చూడటం తగదన్నారు. నలబ’్ఞయ ఏళ్ల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్‌ నిర్వాసితులకు నేటి వరకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఛాయ్‌వాలా పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ నేడు రూ.10లక్షల సూట్‌వాలాగా మారడం శోచనీయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనలో, ప్రవర్తనలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. ఎర్రజెండాలు చీలిపోయి చిక్కిపోయాయని, విడిపోయి పడిపోయాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర సహ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి హేమంతరావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, నాయకులు అజీజ్‌పాషా, సాంబశివరావు పాల్గొన్నారు.