మత్స్యకారుల డిమాండ్లు సత్వరం పరిష్కరించాలి

నెల్లూరు, జూలై 20 : మత్స్యకారుల డిమాండ్లను సుదీర్ఘకాలం నుంచి పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది మత్స్యకారులు ముత్తుకూరు మండంలోని కృష్ణపట్నం ఫోర్టును ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మత్స్యకారులు తమ కుటుంబాలతో సహా ఫోర్టు వైపు దూసుకురావడంతో అప్పటికే భారీగా చేరుకున్న పోలీసు దళాలు వారిని నియంత్రించే ప్రయత్నం చేయబోగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగి ఒక దశలో పరిస్థితి అదుపు తప్పి స్వల్పంగా లాఠీ ఛార్జీ చేశారు. ఈ సందర్భంగా ఎపి మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ, 2002లో కృష్ణ పట్నం ఫోర్టు నిర్మాణ సమయంలో సుమారు 400 మంది మత్స్యకార కుటుంబాలను వివిధ గ్రామాల నుంచి ఖాళీ చేయించారని, వారికి ఇచ్చిన ప్యాకేజి మాత్రం నేటి వరకు అమలు చేయలేదని వారు ఆరోపించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటలో సంపాదించిన చేపలను మార్కెటింగ్‌ చేసుకునేందుకు ఫిష్షింగ్‌ హార్బర్‌ లేకపోవడం వల్ల తమ ఉత్పత్తులను కాకినాడ, ఒంగోలు వంటి ప్రాంతాల్లో అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు. చేపలు ఒకరోజుకే చేడిపోయే అవకాశం ఉందని వాటిని ఇతర ప్రాంతాల్లో అమ్మచూపే సమయానికి కొనుగోలు దారులు ముందుకు రావడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకొని ఫిష్షింగ్‌ హార్బర్‌ను ఏర్పాటు చేయాలని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకార సంఘాలు పాల్గొన్నాయి.