మనుషులపై మందుల ప్రయోగాలా ?


శ్రీసుప్రీం సీరియస్‌.. కేంద్రానికి అక్షింతలు

శ్రీప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మొట్టికాయలు

న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి):

కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలపై ఔషధ ప్రయోగాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మొట్టికాయలు వేసింది. ప్రజలపై నియంత్రణ లేని లేని ఔషధ ప్రయోగాలు దారుణమని సుప్రీంకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. దీనివల్ల అనేక మంది పౌరులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గినీ పందులపై ప్రయోగాలు జరిగినట్లు మనుషులపై ఔషధ ప్రయోగాలు జరుగుతన్నాయని, దీన్ని ఆపాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయస్థానం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం

పూర్తిగా నిర్లిప్తతలో కూరుకుపోయిందని, బహుళ జాతి కంపెనీలు దేశ ప్రజలపై పరీక్షించని ఔషధాలను అక్రమంగా ప్రయోగిస్తుంటే.. వాటిని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. బహుళజాతి కంపెనీల ఔషధ ప్రయోగాలను నిలువరించేందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని వ్యాఖ్యానించింది. ఇక నుంచి ఆరోగ్య శాఖ కార్యదర్శి పర్యవేక్షణలోనే ఔషధ ప్రయోగాలు జరపాలని జస్టిస్‌ ఆర్‌ఎం లోధా, జస్టిస్‌ ఏఆర్‌ ధవేలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘దేశ ప్రజల ఆరోగ్యాన్ని రక్షణ కల్పించాల్సింది విూరు. అది విూ బాధ్యత కూడా. అక్రమ ఔషధ ప్రయోగాలు తప్పనిసరిగా ఆగిపోవాల్సిందే’నని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రయోగాల మూలంగా ఎవరైనా మృతి చెందితే.. బాధ్యులను అరెస్టు చేయాలని ఆదేశించింది. అక్రమ ఔషధ ప్రయోగాల నిరోధానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.

ఔషధ కంపెనీలు మనుషులపై చేస్తున్న ప్రయోగాలపై స్వస్త్య అధికార్‌ మంచ్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం..

నివేదిక సమర్పించాలని కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలను అక్టోబర్‌ 8న ఆదేశించింది. ఔషధ ప్రయోగాలు వికటించి ఇప్పటివరకు ఎంత మంది మరణించారు? ఎంత మంది అస్వస్తతకు గురయ్యారు? వారికి అందించిన నష్ట పరిహారం ఎంత? తదితర వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని జస్టిస్‌ ఆర్‌ఎం లోధా, ఏఆర్‌ దవేలతో కూడిన ధర్మాసనం అప్పట్లో కేంద్రానికి సూచించింది.

కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. అక్రమ ఔషధ ప్రయోగాలను నిలువరించేందుకు వివిధ కమిటీలు ఏర్పాటు చేసింది. ఆయా కమిటీల నివేదికలు అందిన తర్వాత, మళ్లీ

కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. దీనిపై న్యాయస్థాయం ఘాటుగా స్పందించింది. ‘విూరు మళ్లీ కోర్టుకు రావొచ్చు. కానీ, ఔషధ ప్రయోగాల్లో మరణించిన వారి సంగతి ఏమిటి? క్లినికల్‌ ట్రయల్స్‌ వల్ల మృతి చెందిన వారి ప్రాణాలను తిరిగి తీసుకురాలేరు కదా?’ అని వ్యాఖ్యానించింది. ‘కమిటీలు, కమిషన్లు వేయడం చాలా సులువు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి చేసేది. కీలక అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇదో మేలైన మార్గం’ అని ప్రభుత్వంపై మండిపడింది. ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను అమలు చేయనందుకు సిగ్గుపడాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.  ఔషధ ప్రయోగాలు తమ పరిధిలో ఉండవన్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ వాదనతో న్యాయస్థానం ఏకీభవించ లేదు. ఔషధ ప్రయోగాలు జరిగే ఆస్పత్రుల్లో ఉండే డాక్టర్లు, సిబ్బంది ప్రభుత్వ పరిధిలోనే ఉంటారు కదా? అని ఎత్తి చూపింది. ఔషధ ప్రయోగాలపై నివేదికలు సమర్పించాలని అన్ని రాష్టాల్రు, రాష్టాల్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఎనిమిది వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.