బనకచర్ల ముచ్చటొద్దు

` పెండిరగ్‌ కృష్ణాజలాల పెండిరగ్‌ ప్రాజెక్టులపైనే మాట్లాడుకుందాం
` గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితం
` ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుంది
` కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ సర్కారు
` పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండా పంపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌(జనంసాక్షి): గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఆంధ్రా,తెలంగాణ రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.కృష్ణా నదిపై పెండిరగ్‌ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్‌ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని తెలిపింది.గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ నెల 16న (బుధవారం) సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తిశాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్‌లకు సమాచారం పంపించింది. దిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరుగుతుంది. ఈ అంశంతోపాటు రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనాఉంటే వెంటనే పంపాలని జలశక్తిశాఖ కోరింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్‌ అజెండా ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 11న సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ముఖ్యమంత్రుల సమయం కోరినా, సానుకూల స్పందన రాకపోవడంతో 16వ తేదీకి వాయిదావేశారు. ఈ తేదీన హాజరుకావడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించినట్లు తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా గల ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంది. గత పదేళ్లలో రెండు సమావేశాలు జరిగాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకొనేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ఇప్పటికే దిల్లీలో కేంద్రమంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తంచేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి-బనకచర్ల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ గట్టిగా వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రితో జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది.