భూమికి తిరిగొచ్చిన శుభాంశు
` యాక్సియం-4 మిషన్ విజయవంతం
` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ
` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించిన స్పేస్‌ఎక్స్ అధికారులు
వాషింగ్టన్(జనంసాక్షి): అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారు యాక్సియం-4 మిషన్ లో భాగంగా… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగా ములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండిరగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు.ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు.శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు.
యాక్సియం-4 మిషన్ విజయవంతం యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. రోదసిలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం.. మంగళవారం మధ్యాహ్నం 3.01కి కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు.
స్వస్థలంలో సంబరాలు..
మరోవైపు యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంపై భారతీయుల్లో ఆనందం వ్యక్తమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్వస్థలం లఖ్‌నవూలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
కోట్లాది మందికి స్ఫూర్తి – మోదీ
శుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు.. పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు దిక్సూచిగా నిలుస్తుందన్నారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టిన యాక్సియం-4 మిషన్ బృందం.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో సోమవారం బయలుదేరింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ, టిబర్ కపులు ఈ బృందంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఫ్లోటింగ్ వాటర్ బబుల్
శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు.దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘’ఐఎస్‌ఎస్‌లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.
76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు
శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది.
నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం
భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్‌ఎస్‌లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘’మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు.అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘’ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.
గగన్‌యాన్ మిషన్‌కు శుభాంశు యాత్ర ఎంతో కీలకం
` ఇస్రో
న్యూఢల్లీి(జనంసాక్షి):యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లొచ్చారు.దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పందించింది. ‘’ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో శుక్లా సొంతం చేసుకున్న అనుభవం గగన్‌యాన్ మిషన్‌కు ఎంతో కీలకం కానుంది’’ అని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ అభిప్రాయపడ్డారు.కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. ‘’ఈ యాత్ర విజయంతో రోదసిరంగంలో భారత్ శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది యావత్ ప్రపంచానికి గర్వకారణం. ఈ క్షణం భారత్‌కు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది’’ అని హర్షం వ్యక్తంచేశారు. రోదసిలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన శుక్లా బృందం.. మంగళవారం మధ్యాహ్నం 3.01కి కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది కీలకం కానుంది. ఈ క్రమంలో చేపడుతున్న పరీక్షలు విజయవంతం అవుతున్నాయి. ఈ గగన్‌యాన్ ప్రాజెక్టు ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. గగన్‌యాన్ యాత్రను 2027 తొలి త్రైమాసికంలో చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ఇటీవల వెల్లడిరచారు.