మనోజ్‌ కుమార్‌కు దాదాసాహెబ్‌ పాల్కే పురస్కారం

5

న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి): ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌కుమార్‌కు దాదా సాహెబ్‌ పాల్కే పురస్కారం ప్రదానం చేయనున్నారు. 2015 సంవత్సరానికిగాను మనోజ్‌కుమార్‌ దాదాసాహెబ్‌ సాల్కే అవార్డు అందుకోనున్నారు. 78ఏళ్ల మనోజ్‌కుమార్‌ బాలీవుడ్‌లో క్రాంతి, వో కౌన్‌ హీ, పురబ్‌ ఔర్‌ పస్కిన్‌, రోటి కపడా ఔర్‌ మకాన్‌ వంటి సినిమాలు చేశారు. 1992లో మనోజ్‌కుమార్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.  ఉపకార్‌, పూరబ్‌ పశ్చిమ్‌, రోటీ కపడా ఔర్‌ మకాన్‌, క్రాంతి తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మనోజ్‌. దేశభక్తిని తనచిత్రాల్లో ఎక్కువగా చూపించే మనోజ్‌కుమార్‌కు పరిశ్రమలో మిస్టర్‌ భరత్‌ అన్న ముద్దుపేరు ఉంది. ఈ అవార్డుకి మనోజ్‌తో పాటు ప్రఖ్యాత మ్యూజిక్‌ కంపోజర్‌ ఖయ్యాం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అనారోగ్యంతో మనోజ్‌ కుమార్‌ కొంతకాలం ఆస్పత్రిలో చేరడం… అవార్డుకు ఆయననే ఎంపిక చేసేందుకు కారణమైందని భావిస్తున్నారు. 1969లో నెలకొల్పిన దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని సినీ రంగంలో తమదైన ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కించుకున్నవారికి ప్రదానం చేస్తారు. అలనాటి నటి దేవికా రాణి

మొదటి దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. గత ఐదేళ్లుగా ఈ గౌరవాన్ని అందుకున్న ప్రముఖుల్లో శశి కపూర్‌(2015), గుల్జార్‌(2014), ప్రాణ్‌(2013) సౌమిత్రా చటర్జీ(2012), కె.బాలచందర్‌(2011)లు ఉన్నారు. దేశవిభజన సమయంలో మనోజ్‌ భారత్‌లో స్థిరపడ్డారు. ఆయన జన్మభూమి ప్రస్తుత పాక్‌లోని అటోటాబాద్‌.