మన్మోహన్‌జీ మేం నీవెంట

5
సోనియా నేతృత్వంలో సంఘీభావ పాదయాత్ర

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్ల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్‌ సంఘీభావం ప్రకటించింది. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో  సీనియర్‌నేతలు సంఘీభావం తెలిపారు. సోనియాతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీరప్పమొయిలీ, ఆనంద్‌శర్మ, గులాంనబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ తదితరులు ఏఐసీసీ కార్యాలయం నుంచి పాదయత్రగా మన్మోహన్‌ ఇంటికి చేరుకుని మద్దతు తెలిపారు. ఉదయం కాంగ్రేస్‌ అధినేత్రి సోనియాగాంధీ తోపాటు పార్టీ సీనియర్‌ నాయకులు వందమంది వరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్‌సింగ్‌ ఇంటివరకు పాదయాత్రగా వెళ్లి తమ సంఘీభావం తెలిపారు. తామంతా మన్మోహన్‌ వెంట ఉన్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ… మన్మోహన్‌కు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. మన్మోహన్‌సింగ్‌ వ్యక్తిత్వం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలుసు, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన లేనిపోని నిందారోపణలు మోపారని అన్నారు. ఆయన ప్రపంచంలోనే మేటి ఆర్థికవేత్తని అన్నారు. అందుకే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు ఎఐసిసి నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారని అన్నారు. మన్మోహన్‌సింగ్‌ సమగ్రత, నిజాయితీకి మారుపేరు. ఈ విషయం ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచానికే తెలుసు. ఈ విషయంలో తమ సంపూర్ణ మద్దతూ తెలుపుతూ మన్మోహన్‌కు అండగా పోరాడనున్నట్లు పేర్కొన్నారు. కేసు నుంచి ఆయన నిర్దోషిగా బయటపడనున్నట్లు ఆమె తెలిపారు. గత కొన్ని రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడున్న కారణంగా వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సోనియాగాంధీ మన్మోహన్‌కు సమన్ల నేపథ్యంలో నేడు ఇలా స్పందించారు. కాగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెలవుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ వారంతంలో ఆయన సెలవుల నుంచి తిరిగి రానున్నట్లు సమాచారం. మన్మోహన్‌ సింగ్‌ కు బొగ్గు స్కామ్‌ లో సిబిఐ కోర్టు సమన్లు ఇచ్చిన నేపధ్యంలో ఆయనకు అండగా నిలవాలని సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు.  మన్మోహన్‌ సింగ్‌ కోర్టులో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటానని చెబుతున్నారు.  సీతమ్మ శీలాన్ని ప్రశ్నించిన సమాజం మనదని, అలాగే నిజాయితీపరుడైన మన్మోహన్‌ సింగ్‌ ను కూడా శంకించే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్‌.పి.,కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. బొగ్గు విధానంలో గతంలో వాజ్‌ పేయి అనుసరించిన వైఖరినే మన్మోహన్‌ సింగ్‌ పాటించారని, వాజ్‌ పేయిది తప్పు కాదంటున్నవారు. మన్మోహన్‌ సింగ్‌ ను మాత్రం తప్పు పడుతున్నారని ఆమె అన్నారు. సింగ్‌ ఎంతటి నిజాయితీపరుడో అందరికి తెలుసునని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ను కలిసి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విధానాలలో ఇలాంటి ఎదురవుతున్నాయని సింగ్‌ వ్యాఖ్యానించినట్లు రేణుక చెప్పారు. ఇదిలావుంటే మన్మోహన్‌కు సమన్లను మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ తప్పు పట్టారు. ఇది కక్షసాధింపు వ్యవహారంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలు సరికాదన్నారు.