మన కళ సాకారం కాబోతోంది

4

– నాటి ఆనందం మళ్లీ కలిగింది

– రైతులతో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈ ఎండాకాలంలోనే నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తదుపరి కార్యాచరణ రూపొందించేందుకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌, ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు త్వరలోనే హైదరాబాద్‌ వస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. అధికారుల స్థాయిలో శనివారం జరిగిన చర్చలు తనకు సంతృప్తినిచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంతో గత పాలకులు పరిష్కరించలేని దశాబ్దాల నీటి జగడానికి తెరపడడంతో తనకు ఎంతో ఆనందంగా వుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ సాధించినప్పుడు కలిగిన సంతోషాన్ని తిరిగి ఆస్వాదించానన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు మార్గం సుగమం చేయడం పట్ల సంతోషించిన కరీంనగర్‌ జిల్లా రైతులు కృతజ్ఞతాపూర్వకంగా హైదరాబాద్‌ కు పాదయాత్రగా వచ్చారు. ఇత్తడి, వెండి పాత్రల్లో తీసుకొచ్చిన పవిత్ర గోదావరి జలాలను సిఎం కేసీఆర్‌ కు అందజేశారు. ఆ జిల్లా పెద్దపెల్లి నియోజక వర్గం జూలపల్లి మండలానికి చెందిన 210 మంది రైతులు, వారి నాయకుడు రఘువీర్‌ సింగ్‌, జడ్పీటీసీ ప్రీతి ఆధ్వర్యంలో మండల కేంద్రం నుంచి సిఎం అధికార నివాసానికి రావడానికి గత ఆదివారం నాడు పాదయాత్ర ప్రారంభించారు. ఎనిమిది రోజుల తర్వాత ఇవాళ వారు ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకున్నారు. అత్యంత శ్రమకోర్చి 202 కిలోవిూటర్ల దూరం పాదయాత్ర చేపట్టిన వారికి సిఎం కేసీఆర్‌ సాదరంగా స్వాగతం పలికి, భోజనాలు ఏర్పాటు చేసి, ఆతిథ్యమిచ్చారు. అనంతరం రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ” గత పాలకులు పొరుగు రాష్ట్రాలతో, ప్రాజెక్టుల ఎత్తుల పేరు విూద ఎడతెగని పంచాయితీ పెట్టి, ముడిపడని కొట్లాటలు పెట్టుకొని, గోదావరి జలాలను తెలంగాణకు దక్కకుండా చేసిన్రు. ప్రాజెక్టు ఎత్తు పేరుతో జరిగిన కుట్రలకు చరమగీతం పాడి బతుకు-బతుకనియ్యి అనే విధానంలో మహారాష్ట్రతో తమ్మిడి హట్టి, మేడిగడ్డతో సహా మరో మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. నాకీ సందర్భంగా తెలంగాణ వచ్చినప్పటి సంతోషం కలిగింది” అని అన్నారు.తెలంగాణ సాగునీటి విషయంలో గత పాలకులు అనుసరించిన విధానాలను సోదాహరణంగా వివరించిన ముఖ్యమంత్రి.. పాదయాత్ర చేపట్టిన రైతులను అభినందించి, వారి చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణను సాధించుకున్న విధంగానే బంగారు తెలంగాణనూ సాధిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలైన సందర్భంలో తనకు అండగా నిలిచినట్లుగానే.. బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవటం తనకు అత్యంత సంతోషాన్నిస్తున్నదని అన్నారు. అందులో భాగమే పాదయాత్ర అని కొనియాడారు. పాదయాత్రకు నాయకత్వం వహించిన జూలపల్లి స్థానిక రైతు నాయకుడు రఘువీర్‌ సింగ్‌ ను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ సమాజానికి కరీంనగర్‌ రైతులు సరియైన సమయంలో సరియైన సందేశం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాల్సిన చారిత్రక అవసరాన్ని విూ పాదయాత్ర ప్రజలకు మరోసారి గుర్తు చేస్తదని అన్నారు.గోదావరి నది విూద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తాను చేపట్టుతున్న చర్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టడం పట్ల సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో తమకు పుట్టగతులు లేకుండా పోతయనే నిరాశతో ప్రతిపక్ష నేతలు అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తున్నారని అన్నారు. వారికి తెలంగాణకు సాగునీళ్లు అందివ్వాలనే చిత్తశుద్ధి ఏనాడూ లేదన్నారు. గోదావరిలో నీళ్లున్నయి.. కాని తమకు నిరంతర ప్రవాహం ఉండాలనే గత పాలకులు తప్పుడు నిర్ణయాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రాజెక్టులు కట్టుకొని ముందుకు పోకుండా ప్రాజెక్టు ఎత్తు పేరుతో సమస్యను సృష్టించి సాగతీయడం గత పాలకుల నైజమన్నారు. మన పెద్దోళ్లు ఏం జెప్తరు? దొరికిన కాడికి తీసుకోని అయిటంక మల్ల ఎక్కువ కావాల్నని కొట్లాడుమంటరు..” ”తెలంగాణ ప్రాజెక్టులకు ఏమన్నా సమస్యలున్నయా.. వుంటే పెద్దది జెయ్యి.. లెవ్వా.. లేకుంటే తయారు జెయ్యి అనే పంథాను అనుసరించి తెలంగాణ ప్రాజెక్టులను పండవెట్టిన్రు..” అని వివరించారు.నల్లగొండ జిల్లా ఎస్సెల్బీసి ని గత నలభై యేండ్లుగా పనులు పూర్తికాకుండా సొరంగం పేరుతో తొవ్వుతున్న వైనాన్ని సీఎం కేసీఆర్‌ రైతులకు వివరించారు. వైఎస్‌ హయాంలో పోతిరెడ్డిపాడు పేరుతో కృష్ణా నదికి నదినే మలుపుక పోయిన పరిస్థితిని విశ్లేషించారు. ” అసలు కతేందంటే..వాళ్లు పోలవరం కట్టుకోవాలె.. మనకు గూడ యేదో కట్టినట్టు జెయ్యాలె? అగో అట్ల వచ్చిందే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు. ఎక్కడి ప్రాణహిత ఎక్కడి చేవెళ్ల అది సాధ్యమయితదా. ఎక్కడ జాగ లేనట్టు పొయ్యి తమ్మిడిహట్టి కాడ మొదలు పెట్టిన్రు. ఎందుకంటే తెలంగాణ ప్రాజెక్టులు అంతర్రాష్ట్ర వివాదంతోని నడుమనే ఆగిపోవాలె.. అదీ వాళ్ల అసలు కత” అని అన్నారు. గోదావరి, కృష్ణా నదుల విూద మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే దాదాపు నాలుగు వందల బ్యారేజీలు కట్టినయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.” గోదావరి నది విూద బాబ్లీ అనేది చివరాకరిది మాత్రమేనన్నారు. యిగ మనకు ఆ నదుల విూద ఆశలు లేవు. ఎందుకంటే.. వాళ్లు కట్టిన ప్రాజెక్టులతోని మూలకున్న వాళ్ల చెరువులు కుంటలు నిండాలె.. రిజర్వాయర్లు నిండాలె.. అయన్ని నిండినంక ఈ నాలుగొందల బ్యారేజీలు నిండితె.. నీళ్లు కిందికి వదిలితే, అప్పుడు మనకు నీళ్లు వస్తయి అని వివరించారు.

తమ్మిడిహట్టి, కాళేశ్వరమే శరణ్యం

గోదావరి, కృష్ణా నదుల విూద పొరుగు రాష్ట్రాలు విపరీతంగా కట్టిన ప్రాజెక్టుల నేపథ్యంలో తమ్మిడిహట్టి, కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టులే తెలంగాణకు శరణ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు వరదాయనిగా మారనున్న ఈ ప్రాజెక్టులకు తుది ఒప్పందాలు పూర్తవుతాయన్నారు. కరీంనగర్‌ జిల్లా సహా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆంధ్రాలోని గోదావరి జిల్లాలను మించిపోయే రోజులు త్వరలోనే రానున్నాయని రైతుల హర్షద్వానాల నడుమ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మొదటి పొలానికి ఎట్లయితే పుష్కలంగా నీళ్లు పారుతయో.. కాలువ చివరి ఆయకట్టుకూ అంతే నీరు అందేటట్టు ప్రాజెక్టులను రూపొందిస్తున్నా”మని తెలిపారు. దాదాపు కోటి ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేసి వలస రహిత తెలంగాణను తీర్చిదిద్దడమే తన ధ్యేయమని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా రైతులు తెచ్చిన పవిత్ర గోదావరి జలాలను స్వీకరించిన ముఖ్యమంత్రి.. పాదయాద్రకు నాయకత్వం వహించిన జూలపల్లి రైతు రఘువీర్‌ సింగ్‌ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌ రావు, భానుప్రసాద్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ, కరీంనగర్‌ జిల్లా టిఆర్‌ఎస్‌ నేతలు శంకర్‌ రెడ్డి, అక్బరుద్దీన్‌, ప్రీతి రఘువీర్‌ సింగ్‌, పుట్ట శైలజ, కట్ల సతీశ్‌, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ లు తదితర జిల్లా నేతలు పాల్గొన్నారు.