మన సత్తా చాటాలి
-దేశంలో తిరుగలేని శక్తిగా ఎదగాలి
-ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్,ఏప్రిల్ 21 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి తిరుగులేని శక్తిగా ఎదిగిన తెరాస సత్తాను యావత్ దేశానికి చాటిచెప్పేలా టిఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీ ప్లీనరీ జరిగే ఎల్బీ స్టేడియాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ నెల 24న ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశానికి 36 నుంచి 40వేల మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశర చేసేలా తీర్మానాలు ఉంటాయని కేటీఆర్ వివరించారు. నిరంతరం శ్రమించే కార్యకర్తల శ్రేయస్సు కోసం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆరు కమిటీలు ప్లీనరీ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఇకపోతే మంత్రులు, ఎంపిలు తమకు అప్పగించిన పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్, మంచినీరు, భోజనాలపై పెద్దగా దృష్టి పెట్టారు. తీర్మానాల కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సైతం కమిటీతో సమావేశమై దాదాపు నాలుగున్నర గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి కూడా క్యాంపు కార్యాలయంలో తీర్మానాల కమిటీ సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ అయింది. రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన ఈ సమావేశంలో ప్లీనరీలో 12 తీర్మానాలు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. తీర్మానాల్లో సంక్షేమ-అభివృద్ధి రంగాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. విద్యుత్‌పై కూడా ఒక తీర్మానం చేయనున్నారు. తీర్మానాల అంశం కొలిక్కి రావడంతో తీర్మానాల ముసాయిదా సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ కమిటీకి సూచించారు.ముసాయిదా రూపకల్పన అనంతరం సీఎం లాంఛన ఆమోదంతో ఈ పక్రియ పూర్తి కానుంది. ప్లీనరీకి వచ్చే 36వేల మంది ప్రతినిధులకు వీటి ప్రతులు ఇవ్వాల్సి ఉన్నందున వాటి ముద్రణకు అనువుగా ఈ పక్రియ పూర్తి చేయాలని సీఎం చెప్పినట్లు తెలిసింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేసవిలోనూ కోతల్లేని విద్యుత్ సరఫరా తోపాటు రెండు, మూడేండ్లలో తెలంగాణను కరెంటు మిగులు రాష్ట్రంగా రూపొందించేందుకు పక్కా ప్రణాళికలతో ముందు కెళుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కరెంటు అం శానికి తీర్మానాల్లో పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వ్యవసాయ రంగంపై తీర్మానం చేయనున్నారు. సర్కారు సాగునీటి ప్రాజెక్టులే కాక మిషన్ కాకతీయ పేరుతో గ్రామస్థాయిలో చెరువుల పునరుజ్జీవనానికి కంకణం కట్టుకున్నందున వ్యవసాయ రంగానికి కూడా తీర్మానాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే అత్యుత్తమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన ప్రభుత్వం దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు సింగిల్ విండో విధానాన్ని తెస్తున్నది. ఈ రంగానికి తీర్మానాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. కీలకమైన రాజకీయ అంశాలపై కూడా ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆసరా, హాస్టళ్లలో సన్నబియ్యం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాపై తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. సీఎంతో జరిగిన సమావేశంలో ఏఏ అంశాలపై తీర్మానాలు ఎలా ఉండాలనే అంశం తో పాటు అందులో వాడే పదజాలంపై కూడా చర్చించినట్టు సమాచారం.