మమత నమ్మించి నట్టేటముంచేసింది!
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్
కోల్‌కతా,ఏప్రిల్ 18(జనంసాక్షి):తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం నిప్పులు చెరిగారు. ఆమె పశ్చిమబెంగాల్ ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. ‘ఐదేళ్ల క్రితం 70 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హావిూ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, శాంతిభద్రతలను కాపాడుతామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హావిూలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ కొత్త హావిూలు ఇస్తున్నారన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రఘునాథ్ గంజ్ లో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఆద్యాంతం టీఎంసీపై విమర్శలు గుప్పించారు.ఒక వేళ మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి కూడా ఆమెకు హావిూలు గుర్తుండవు’ అంటూ టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ‘మమత మాటలు నమ్మి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక హావిూలకు నీళ్లొదిలారు’ అని రాహుల్ విమర్శించారు. బెంగాల్ కు పరిశ్రమలు రాలేదని, యువతకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు నిరుద్యోగులు తరలివెళుతున్నారన్న ఆయన వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మమతను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్రమోది, రాష్ట్రంలో మమతా బెనర్జీ రైతులకు చేసిందేవిూలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శారదా కుంభకోణం నిందితులను శిక్షిస్తామని చెప్పారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హావిూలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ఆ హావిూలను నెరవేర్చడంలో ఆమె విఫలమయ్యారని రాహుల్ ఎద్దేవా చేశారు. మమతపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘ఐదేళ్ల క్రితం టిఎంసికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. మార్పు, అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపరచడం వంటి హావిూలను అప్పట్లో ఆమె ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక ఆమెలో మార్పు వచ్చింది. కాంగ్రెస్‌కు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావిూలను ఆమె మరిచిపోయారు’ అని రఘునాథ్ గంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్న యువత కోసం ఫ్యాక్టరీలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తామని మమతాజీ వాగ్దానం చేశారని, ఆ తర్వాత ఒక్క ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇచ్చిన హావిూ నిలుపుకోని ఆమెకు మనం మద్దతు ఇవ్వనక్కర్లేదని, ఆమెను ఓడించేందుకు సమష్టిగా పోరాటం సాగిద్దామని రాహుల్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్-వామపక్షాల కూటమిపై ఆయన మాట్లాడుతూ, ఎన్నికల తర్వాతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శారదా స్కామ్‌లో ప్రమేయం ఉన్న, అవినీతికి పాల్పడిన వారిపై చర్చలు తీసుకుంటుందన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు బీడీ కార్మికులను ఆదుకుంటుందని రాహుల్ హావిూ ఇచ్చారు.