మమత పరివర్తన చెందలేదు
– బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ
కోల్‌కతా,ఏప్రిల్ 7(జనంసాక్షి): పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలను మమత బహిష్కరిస్తున్నారని ఆరోపించారు. పరివర్తన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన దీదీ ఆ దిశగా కృషిచేయడంలో తీవ్రంగా విఫలమయ్యారన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అంశంపై సమావేశం నిర్వహిస్తే హాజరు కావాల్సింది పోయి మమతా బెనర్జీ బహిష్కరిస్తున్నారు. ఆమె తీరు తో పశ్చిమ్‌బంగా రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోంది. మోదీ నిర్వహించే సమావేశాలకు ఆమె హాజరుకారు. కానీ ఎప్పుడైనా ఆమె దిల్లీకి వస్తే మాత్రం సోనియాగాంధీ ఆశీస్సులు కోసం తప్పకుండా వెళ్తారు’ అని మోదీ చమత్కరించారు.
అనవసర నిందలతో రాజకీయ లబ్దికి మమత యత్నం..
పరివర్తన్ నినాదంతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.మమత ఎప్పుడు ‘మా -మాటి- మానుష్’ అంటారని, కానీ ఇక్కడ చావులు, డబ్బుకే పరిమితమవుతున్నారన్నారు. ఇదే విషయాన్ని నారద కుంభకోణం తేటతెల్లంచేసిందన్నారు. ఇటీవల కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న పైవంతెన కుప్పకూలిపోతే సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకోవాల్సింది పోయి మమత అనవసర నిందారోపణలకు దిగారని విమర్శించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి లెఫ్ట్ ప్రభుత్వం హయాంలోనే ఒప్పందం కుదిరిందని నిందలు వేశారు. అయితే ఆ ఫ్లైఓవర్ వారి హయాంలో పూర్తయినట్లయితే వారిని అభినందించేవారా? అని ప్రశ్నించారు. అనవసర నిందలతో రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
భాజపాతోనే అభివృద్ధి..
వామపక్షాల అస్తవ్యస్థ పాలన అనంతరం అధికారంలోకి వచ్చిన మమత రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు కృషిచేయాల్సింది పోయి.. మళ్లీ వారి పాలననే తలపిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు పరస్పర నిందారోపణలతో రాజకీయ చదరంగం ఆడుతున్నాయన్నారు. అందువల్ల ఆ పార్టీలతో ప్రజలకు భవిష్యత్తు, సంరక్షణ రెండు కరవవుతాయన్నారు. శారదా కుంభకోణంలో చిక్కుకున్న తన వారిని మమత కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో భాజపాకు అవకాశమివ్వాలని రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేశారు. భాజపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.