మయన్మార్‌కు తొలి సహయం
మిలియన్ డాలర్లు అందించేందుకు ముందుకొచ్చిన టర్కీ
బాధితులను పరామర్శించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్
వివరాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టిన టర్కీ ప్రధాని భార్య ఎమైన్
మయన్మార్ :మయన్మార్ ఊచకోతకు గురైన 20 వేల ముస్లింలకు చేయూతనందించేందుకు మరో ముస్లిం దేశం టర్కీ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బాధిత ముస్లింలకు ఒక మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని టర్కీ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్ దావుతొగ్లూ ప్రకటించారు. ఆయన మయన్మార్‌ను సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఆయన వెంట టర్కీ ప్రధాని తయ్యబ్ ఎర్దోగాన్ సతీమణి ఎమైన్ ఎర్దోగాన్ కూడా ఉన్నారు. బాధితులతో మాట్లాడిన ఆమె వారిపై జరిగిన అఘాయిత్యాలను వారి నోటనే విని చలించిపోయారు. అనేక సందర్భాల్లో బాధితుల గోడును వింటూ ఆమె కూడా కన్నీళ్లు కార్చారు. పగవారికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదని ఆమె గద్గద స్వరంతో అన్నారు. మంత్రి అహ్మద్ మాట్లాడుతూ మయన్మార్ ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రస్తుతం తక్షణ సాయంగా ఒక మిలియన్ డాలర్లు ఇక్కడి ముస్లింలకు అందిస్తున్నామని వెల్లడించారు. ఒక్క మయన్మార్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్త చేశారు. ముస్లింలు మైనార్టీలుగా ఉన్న దేశాల్లో, వారి భద్రత గురించి ఆయా దేశాలు పటిష్ట చట్టాలు చేయాలని
విజ్ఞప్తి చేశారు. కొన్ని దేశాలు ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని, ఈ ప్రయత్నాలను ముస్లింలు సంఘటితంగా తిప్పికొట్టాలని అహ్మద్ పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్ని ఏకతాటి పైకి వచ్చి, ప్రపంచ ముస్లింల రక్షణ కోసం చర్చించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వెల్లడించారు. దీని కోసం టర్కీ ముందుంటుందని, మయన్మార్ ముస్లింలు ఏ మాత్రం భయపడవద్దని, టర్కీ దేశం ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని మంత్రి అహ్మద్, ఎమైన్ భరోసానిచ్చారు.