మయన్మార్‌ అధ్యక్షుడిగా హతిన్‌ కావ్‌

2

– విదేశాంగ మంత్రిగా అంగ్‌సాన్‌సూకీ ప్రమాణం

న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): మయన్మార్‌లో దశాబ్దాల మిలిటరీ పాలనకు తెర పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్‌శాన్‌ సూచీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సూచీ కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. పౌరసత్వ సమస్య కారణంగా దేశ అధ్యక్ష స్థానానికి సూచీకి అర్హత లేకపోవడంతో ఆమెకు అత్యంత సన్నిహితుడైన హితిన్‌ క్యాను మయన్మార్‌ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. సూచీ విదేశాంగ శాఖతో పాటు మరో మూడు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారని స్పీకర్‌ యు మాన్‌ విన్‌ ఖైంగ్‌ తెలిపారు. సూచీ ప్రెసిడెన్సీ కార్యాలయ సంబంధిత మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ, ఎలక్టిస్రిటీ అండ్‌ ఎనర్జీ మంత్రిత్వ శాఖల బాధ్యతలు తీసుకోనున్నారు. ఇకపోతే మయన్మార్‌ దేశాధ్యక్షుడిగా హతిన్‌ కావ్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గత 50 ఏళ్లలో ఆ దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా దేశాధ్యక్షుడు ఎన్నిక కావడం ఇదే తొలిసారి. పార్లమెంట్‌ భవనంలో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను నిర్వహించారు. ఎన్‌ఎల్డీ పార్టీకి చెందిన ఆరెంజ్‌ రంగు దుస్తుల్లో హతిన్‌ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఆర్మీ ఆధీనంలోని జుంటా ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగాన్ని సవరిస్తామని ఈ సందర్భంగా దేశాధ్యక్షుడు హతిన్‌ తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్యాంగం వల్ల ఆంగ్‌ సాన్‌ సూకీ దేశాధ్యక్ష పదవికి అర్హత పొందలేకపోయారు. దాంతో ఆ చట్టాన్ని సవరించాలని నూతన అధ్యక్షుడు భావిస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో నూతన ప్రభుత్వ అధికారాలు అమలులోకి వస్తాయి.