మరణం గురించి రెండు కవితలూ, ఓ కథ


సమస్యలకి మరణం సమాధానం కాదు. కానీ చాలా మంది తమ మరణం వల్ల ఏదో అద్భుతం జరుగుతుందని అనుకుంటారు. తెలం గాణ కోసం మరణిస్తున్న వ్యక్తులు ఆ విధంగా భావిస్తున్న వ్యక్తు లే.కానీ ఒక సమస్య మీద లేదా ఒక అంశం మీద నిరాహార దీక్ష జరపడం, ఆ సందర్భంలో మరణం సంభవిస్తే వుండే ప్రభావం, పరిణామాలు వేరుగా వుంటాయి. మొదటిది ఆత్మహత్య అయితే బలవంతపు ఆత్మహత్య అవుతుంది. ఇవి రెండు కాకుండా కొన్ని సహజ మరణాలు వుంటాయి. అవి సహజ మరణాలు అయిన ప్పటికీ ఆ మరణ ప్రభావం సన్నిహితుల మీద ఎక్కువగా వుంటు ది. వారి కుటుంబ సభ్యుల మీద, ఆ వ్యక్తి స్నేహితుల మీద ఆ మరణ ప్రభావం వుంటుంది. ఈ మరణాలు కాకుండా మరికొన్ని మరణాలు వుంటాయి. వాటి ప్రభావం కూడా ఆ కుటుంబ సభ్యుల మీద సన్నిహితుల మీద వుంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చి కొం త మంది దూరమవుతారు. పట్టింపుల వల్ల, ఆస్తి తగాదాల వల్ల మరికొంత మంది దూరమవుతారు. శుభకార్యాలు ఆయా కుటుం బాల్లో జరిగినా కూడా వాళ్లు కలుసుకోరు. కొంతమంది కలిసిపో వచ్చు. కానీ ఎక్కువ మంది కలువరు. తమ పట్టింపులని అభిప్రాయ భేదాలని పక్కకు పెట్టారు. కానీ ఆ వ్యక్తుల్లో ఎవరైనా మరణిం చినప్పుడు మళ్లీ ఆ కుటుంబాలు కలిసిపోతాయి. ఆ స్నేహితులు కలిసిపోతారు. వాటి పంటి బిగువున వున్న పట్టింపులు అప్పుడు మట్టిలో కలిసిపోతాయి. వాళ్ల దు:ఖం పొంగిపొరలుతుంది. ఆ దు:ఖానికి కూడా విలువ వుంటుంది. ప్రేమలు వుండి దూరమైన వ్యక్తులు కాబట్టి ఆ దు:ఖానికి విలువ వుంటుంది. ఈ నేపథ్యంలో ‘ఒక మరణం తరువాత’ అన్న కవితని ఉదహరిస్తాను.
‘ఏముంటుందీ
ఒక మరణం తరువాత
కాస్త బూడిద కాసిన్ని అస్థికలు
కొంత బాధ మరికొన్ని కన్నీళ్లు
ఏమైపొయ్యాయి?
పంటి బిగువున వున్న పట్టింపులు మన కోపాలు
ఏం సాధించాం?
మన దు:ఖానికి ఏమైనా విలువుందా?
మరణం తరువాత తెలిసిన విషయం ఒక్కటే
ఒక విషయాన్ని అంగీకరించడం వెనక ఎంత ఘర్షణ వుంటుందోనన్న విషయం
ఒక జీవితాన్ని చూసి ఎంత నేర్చుకోవచ్చు ఒక మరణాన్ని చూసి
అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చన్న విషయం’
ఓ జీవితాన్ని గురించి ఎంత నేర్చుకోవచ్చో, ఒక మరణాన్ని చూసి కూడా అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇది వాస్తవం. కానీ చాలా మంది గ్రహించరు. అదేవిధంగా ఒక వ్యక్తి మరణించిన తరువాతన వారి మధ్య ఆగాధం ఏర్పడటానికి దారితీసిన అంశాన్ని గ్రహిస్తారు. ఈ విషయాలని ఆ వ్యక్తి మరణించిక ముందు గ్రహిస్తే ఎంత బాగుండునని కూడా విచారిస్తా రు.మరణం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఓ అనామక వ్యక్తి రాసిన ఓ కథ గుర్తుకు వచ్చింది. ఆ కథ మీకు వివరిస్తాను.
మధ్య వయస్కురాలైన ఓ స్త్రీ కొడుక్కి ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్‌ వచ్చి అతను మరణిస్తా డు. ఆ మహిళ వేధనకు అంతు వుండదు. కొడుకు కోరిక మేరకు అతని శవాన్ని హాస్పిటల్‌కి ఇచ్చే స్తుంది. బాధతో ఇంటికి వస్తుంది. ఎప్పుడో అర్ధరాత్రి ఆమెకు నిద్రప డుతుంది. ఓ గంటకే ఆమెకు మెలకువ కూడా వస్తుంది. ఆమె మంచం పక్కక ఒక ఉత్తరం వుంటుంది. గబగబా ఆ ఉత్తరాన్ని తీసి చదవడం మొదలు పెడుతు ంది. ఆ ఉత్తరం ఇలా వుంటుంది.
‘అమ్మా!
నేను నీకు అందకుండా పోయాను. కానీ నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోను. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే వుంటాను. గతంకన్నా ఎక్కువగా నిన్ను మర్చిపోను. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే వుంటాను. గతంకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. మళ్లీ ఎప్పుడో మనం కలుస్తాం. అప్పటిదాకా నువ్వు ఒంటరిగా వుండకు ఒక పాపనో, బాబునో దత్తత తీసుకో. నా గదిని నా ఆట వస్తువులని అతనికి ఇవ్వు. ఆ ఆట వస్తువులు అతనికి నచ్చకపోతే కొత్త వస్తువులు కొనివ్వు.నా గురించి విచారించకు. ఇక్కడ అంతా బాగుంది. ఇక్కడికి రాగానే నానమ్మ, తాతయ్య కలిశారు. నాకు ఈ కొత్త ప్రాంతమంతా చూపిస్తామన్నారు. కొంతకాలం తరువాత చూస్తానని చెప్పాను. ఇక్కడ అంతా బాగుంది. ఇక్కడ దేవతలు చాలా బాగా వున్నారు. వాళ్లు గాలిలో ఎగురుతున్నారు. నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్లారు. ఆయన నన్ను ఎత్తుకున్నారు. తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. అమ్మకి ఉత్తరం రాయాలని ఆయనతో చెప్పాను. అయనే ఈ కాగితం ఇచ్చారు. ఆయనే పెన్ను కూడా ఇచ్చారు. దానితోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. నా ఆరోగ్యం బాగా లేనప్పుడు దేవుడు ఎక్కడ వున్నాడు’ అని నువ్వు ప్రశ్నించావు కదా! ఆ ప్రశ్నకు సమాధానం రాయమని భగవంతుడు నాకు చెప్పాడు. అతను నాలో వున్నాడని, అందరి పిల్లల్లో ఉన్నానని చెప్పమన్నాడు.అమ్మా! నీకో విషయం చెప్పాలి. ఈ అక్షరాలు నీకు తప్ప మరెవరికీ కన్పించవు. నేను ఎవరిని బాధపెట్టను. నాకు ఏ బాధాలేదు.
అమ్మా! ఇక వుండనా!’
ఇదీ ఉత్తరం. దేవుడు వున్నాడా! ఇలా జరుగుతుందా? అన్న ఆలోచనలు సహజంగానే వస్తాయి. దేవుడు వున్నాడో లేదో తెలియదు కానీ ప్రకృతి వుంది. దేవుడనేది ఒక భావన. ప్రకృతి అనేది వాస్తవం. అందుకే పంచభూతాలని ప్రార్థించమన్నారు పెద్దలు. మంచినే తలుచుకోమన్నారు. అంతులేని శక్తి మన మెదడులో వుంది. దాన్ని ఎంతైతే ఉపయోగించాలో అంతగా ఎవ రూ ఉపయోగించడం లేదు. ఉత్తరం నిజమైనా కాకపోయినా ఆ ఉత్తరం అన్న భావన ఎంత ఉపశమనాన్ని ఇస్తుంది.శివున్ని చూద్దామని వెళ్లి అసంఖ్యాక భక్తులు అనంత వాయువుల్లో కలిసిపోయారు. వాళ్ల కుటుంబ సభ్యులకి అనంత వేధనని మిగిల్చి వెళ్లారు. ఇలాంటి ఉత్తరం వాళ్లకు కూడా లభిస్తే ఎంత బాగుండు అని అన్పిస్తుంది. మనిషి మనుగడకి భావన అవసరం. మంచి భావన ఉపశమనాన్ని ఇస్తుంది.చాలా మంది కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుల పార్థీవ శరీరాలని కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. చివరిసారిగా ఆ వ్యక్తులని చూసే అవకాశాన్ని వాళ్లు కోల్పోయారు. చివరి  చూపునకు వుండే విలువ చూపుకే వుంటుంది. మొదటి చూపు ఎంత ముఖ్యమైందో, ఆఖరి చూపూ అంతే ముఖ్యమైంది. అది ఆ ఆత్మీయులు కోల్పోయారు. చివరి చూపు గురించి ఓ కవిత మీకు ఉదహరిస్తాను.
‘సెంటిమెంటని కొట్టిపారెయ్యకు ` చూపుల కవిత్వాన్ని
మొదటిచూపు ఎంత అవసరమో ` ఆఖరి చూపు అంతే అవసరం
పుట్టిన పసిపాపని చూసే మొదటి చూపు ఎలాంటిదో
ఆఖరి చూపు అలాంటిదే!
అందులో ఎంత ప్రేమ వుందో ` ఇందులోనూ అంతే!
ఇంకా చెప్పాలంటే
అంతకన్నా ఎక్కువగా ` ప్రేమ వుంది ఆత్మీయత వుంది వేదన ఉంది
అందుకే `
మొదటిచూపు ఎంత అవసరమో ` ఆఖరి చూపూ అంతే అవసరం.
మనిషి ఒక భావన ఎంత ముఖ్యమో, సెంటిమెంటూ అంతే! భావన లేకుండా మనిషి లేడు. సెంటిమెంట్‌ లేకుండా కూడా మనిషి లేడు. ఈ రెండూ మనిషి మనుగడలోని అంతర్భాగాలు. ఒకదాన్ని తీసి మరోదాన్ని చూడలేం.
పుట్టుక, మరణంలాగే ఇవి రెండూ మనిషిలోని అంతర్భాగాలు. ప్రకృతి దేవుడూ కూడా అలాంటివే.