మళ్లీ అదే వివక్ష

శ్రీ కొనసాగుతున్న సీమాంధ్ర పెత్తందారి తనం

శ్రీ 200 మునిసిపల్‌ హైస్కూళ్ల అప్‌గ్రెడేషన్‌ శ్రీ తెలంగాణకు మొండిచేయి

శ్రీ ఆ ప్రాంతంలో పోలిస్తే ఇక్కడ మూడో వంతే సర్కారు కళాశాలలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) :

సీమాంధ్ర పెత్తందారి పాలకులు మరోసారి తమ బుద్ధిని చాటుకున్నారు. తమ ప్రాంతంలోని 200 మునిసిపల్‌ స్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసి తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపారు. ఇప్పటికే 14 జిల్లాల్లో వెయ్యి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నా మరో 200 కళాశాలలకు పర్మిషన్‌ ఇప్పించుకున్నారు. అదే తెలంగాణలోని పది జిల్లాల్లో కేవలం 400 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలే ఉన్నాయి. మారుమూల మండలాల్లో కళాశాలలు లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నా పాలకుల్లో పట్టింపులేదు. కానీ తమ ప్రాంతంపై చెప్పలేనంతగా ప్రేమ కురిపించారు. వారి తీరును తెలంగాణ వేత్తలు ముక్తకంఠంతో కండిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో అసలు మునిసిపల్‌ స్కూళ్లే లేవనే విషయం 200 సూళ్లు అప్‌గ్రేడ్‌ అయ్యే వరకు మన ప్రజాప్రతినిధులకు తెలియకపోవడం గమనార్హం. ఇంత దౌర్భాగ్యపు నేతలుంటే మనకు అన్యాయం జరుగకుంటే ఇంకేం జరుగుతుంది. కొత్త కళాశాలల ఏర్పాటుతో సీమాంధ్ర ప్రాంతంలో 1200 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా అందులో మూడో వంతు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. అంటే మనకు ఎంత అన్యాయం జరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది. 200 మునిసిపల్‌ స్కూళ్ల టీచర్లు ఇంతకాలం ఎన్ని సౌకర్యాలు అనుభవించారో మన ఉపాధ్యాయులు అవన్నీ కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాలకు జిల్లా పరిషత్‌ పాఠశాలలే పెద్ద దిక్కు. ఇప్పటికీ సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలెన్నో తెలంగాణలో ఉన్నాయి. వారికి జూనియర్‌ కళాశాలలు అందుబాటులో లేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కాస్త ఆర్థిక స్తోమత ఉన్న వారే దూర ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకుని పిల్లలను చదివిస్తున్నారు. తెలంగాణలోని కొన్ని మండలాల్లో చిన్నపాటి ప్రైవేటు కళాశాలలున్నా వాటిలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. ఇప్పటికే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జబ్లింగ్‌ పద్ధతిలో నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. కానీ మన దగ్గర దశాబ్ద కాలంలో ఏర్పాటు చేసిన ఏ కళాశాలల్లోనూ సైన్స్‌ ల్యాబ్‌లు అందుబాటులో లేవు. గతేడాది ఒక్కో కళాశాలకు రూ.2 లక్షలు కేటాయించి ల్యాబ్‌ పరికరాలు కొనుక్కోమన్నా అవి పెట్టేందు స్థలం లేక అల్మారాలకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడి విద్యార్థులు ప్రాక్టికల్‌ గండం గట్టెక్కడమే కష్టం. మనకు అరకొర నిధులు విదిల్చే పాలకులు అన్ని సౌకర్యాలున్న మునిసిపల్‌ స్కూళ్లను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసి అక్కడి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంతకంటే సీమాంధ్ర పాలకుల వివక్షకు ఉదాహరణలేం కావాలి. కనీసం కళాశాలలు అవసరం ఉన్న మండలాల్లోని జెడ్పీ పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసినా మనకు కొంత ఉపయోగకరంగా ఉండేది. పాలకుల దుర్నీతిని, స్వార్థబుద్ధిని కళాశాలల అప్‌గ్రెడేషన్‌ వ్యవహారం మరోసారి చాటుతోందని తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం ప్రతినిధులు ఆరోపించారు.