మళ్లీ అధికారం మనదే

C
– రాజకీయాలు అవినీతికి అడ్డా కారాదు

– ప్రజలకు సేవ చేద్దాం

-చరిత్రలో నిలిచిపోదాం

– మూడు రోజుల శిక్షణ శిబిరంలో కేసీఆర్‌

నల్లగొండ,మే 4 (జనంసాక్షి):

నెక్స్‌టర్మ్‌లో మనమే గెలుస్తాం…ఒకసారి గెలిచిన తరవాత మళ్లీ గెల్చుకునే శక్తి సాధించుకోవాలి. లేకుంటే చరిత్రలో కొట్టుకుని పోతాం.. ఇప్పటికే తెలంగాణలో తొలితరం నాయకులుగా మనం నిలిచిపోయాం. ఆ పేరు శాశ్వతంగా ఉండేలా చూసుకోవాలని టిఆర్‌ఎస్‌ అధినేత , సిఎం కెసిఆర్‌ అన్నారు.  2019లో కూడా  టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారాన్ని చేపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోస్యం చెప్పారు.  ప్రజా ప్రతినిధులు మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కేసీఆర్‌ తెలిపారు. డబ్బు కావాలంటే చాలా మార్గాలున్నాయని.. ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రజల పక్షాన్నే నిలవాలని సూచించారు. ఒకసారి గెలిచాక ప్రజల వెన్నంటి వుంటే విజయం అదే వస్తుందని అన్నారు. నాగార్జున సాగర్‌లో  శిక్షణ తరగతుల్లో భాగంగా మూడవరోజు సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వెయ్యేండ్లు బతకడానికి మనమెవ్వరు రాలేదని, ప్రజాప్రతినిధులుడబ్బులు సాంపాదించడం గొప్ప కాదని, డబ్బే పరమావధి అనుకుంటే పెండ అమ్ముకుని కూడా సంపాధించవచ్చన్నారు. ప్రజాప్రతినిధులంటే సమాజం గొప్పగా భావించే రోజులు రావాలన్నారు. అందరికీ ఈ అవకాశం రాదని, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోగానీ మనకు ఈ అదృష్టం దక్కిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సమాజంలో గొప్పగా బతకాలన్నారు.అయితే అది మాత్రమే గాకుండా అవినీతికి తావులేకుండా మనగలగాలన్నారు. ప్రతీ ఒక్కరూ చరిత్ర సృష్టించుకునే విధంగా పని చేయాలని..లేని పక్షంలో మనమే చరిత్రలో కలిసిపోతామని అన్నారు. అనుకన్నది సాధించడం టీఆర్‌ఎస్‌ నైజమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలంగాణ రాదన్న వారికి.. దాన్ని సాధించి చూపించామన్నారు. ప్రజాప్రతినిధులంటేనే నేడు సమాజంలో ఓ చులకన భావన ఉందని, ఈ పరిస్థి కారణం ప్రజాప్రతినిధులేనన్నారు. ప్రజాప్రతినిధులు తమ కారెక్టర్‌ను తామే దిగజార్చుకున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజాప్రతినిధులంటేనే దోపిడిదారులు, దోచుకోవడానికే పదవిలోకి వచ్చారు, రాజకీయ నాయకుడంటనే డబ్బు సంపాదన, అవినీతి దందా అనే భావన ఇవాళ సమాజంలో నాటుకుపోయిందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితి నుంచి మనం బయటపడాలని, ప్రజాప్రతినిధి అంటే గోప్పగా భావించే స్థితిని తెచ్చుకోవాలని సూచించారు.  కొత్త రాష్ట్రం తెలంగాణకు మనం మొదటి ప్రజాప్రతినిధులం.. తప్పకుండా చరిత్రలో నిలుస్తాం.. అయితే… మనకన్నా ముందున్న వారికంటే భిన్నంగా, వారికీ-మనకూ తేడా ఎందనేది ప్రజలకు అర్థమయ్యేలా మెలగాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనం గెలుస్తాం.. అది పెద్ద విషయం కాదు.. ఆ స్థితిని మనం తెచ్చుకోవాలి… ప్రజల వెంబడుండి వారి సమస్యలకోసం పనిచేయాలని కెసిఆర్‌ సూచించారు.  మూడురోజులపాటు మనం గొప్ప అనుభవాలు పంచుకున్నామని, ప్రతి ఆర్నేళ్లకోరోజు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుందామని సీఎం అన్నారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శిక్షణా తరగతుల్లో ఆయన ప్రసంగిస్తూ తాను 70వేల నుంచి 80 వేల పుస్తకాలు చదివానన్నారు. తనది పొలిటికల్‌ లైన్‌ కాదు..కల్చరల్‌ లైనని స్పష్టం చేశారు. ఉద్యమం మొదలైన నాడు ఐతదా పోతదా అని చాలా మంది అన్నారు. తెలంగాణను కష్టపడి సాధించుకున్నమని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తరం ప్రజాప్రతినిధులుగా విూ పేరు నిలిచిపోతదని నిర్ధేశించారు. విూరంతా అవినీతికి ఆమడ దూరంలో ఉండి ప్రజలతో మమేకమవ్వాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు. గుంట పొలం కూడా కరెంట్‌ కారణంగా ఎండిపోవద్దని నేతలకు ఉద్ఘాటించారు. ఏ ముఖ్యమంత్రి చూడనట్వంటి దేవాలయాలు తాను చూశానన్నారు. దాశరథి పేరుతో అవార్డు ఇవ్వాలని గత పాలకులు ఏనాడైన అనుకున్నారా అని అన్నారు. అందుకే  ప్రజలకు సేవ చేయడమే మన అంతిమ లక్ష్యం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతూనే ఉండాలని కోరారు. ప్రజలకు మనం చేసిన సేవే మనల్ని మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఎన్నో అంశాలపై లోతుగా చర్చించుకున్నామని చెప్పారు. తాను గతంలో ఎటైనా వెళితే బట్టల బ్యాగ్‌ చిన్నగా ఉంటే పుస్తకాల బ్యాగ్‌ పెద్దగా ఉండేదని తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో మనం చాలా అనుభవాలను పంచుకున్నామని పేర్కొన్నారు. మున్ముందు కూడా ఇలాగే శిక్షణా తరగతులను నిర్వహించుకుందాని తెలిపారు.