మళ్లీ పటేళ్ల ఆగడాలు
– 24 గంటల పాటు మొబైల్, ఇంటర్‌నెట్ సేవల నిలిపివేత
అహ్మదాబాద్,ఏప్రిల్ 17(జనంసాక్షి):రిజర్వేషన్ల సాధనం కోసం గుజరాత్‌లో పటేల్ సామాజికవర్గం చేస్తున్న ఉద్యమం మరోసారి ఉద్రిక్తంగా మారింది. పటేళ్ల రిజర్వేషన్ల నాయకుడు
హార్దిక్ పటేల్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మెహ్సనా పట్టణంలో ఆ సామాజికవర్గం వారు చేపట్టిన ఆందోళన సందర్భంగా ఘర్షణ చెలరేగింది.
ర్యాలీకి అనుమతి లేకున్నా 5 వేలమంది ఉద్యమకారులు తరలివచ్చారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో కనీసం 12 మంది గాయపడినట్టు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మెహ్సనాలో కర్ఫ్యూ విధించారు. ఇక ఆ రాష్ట్రంలోనే సూరత్ నగరంలో పోలీసులు 500 మంది పటేల్ సామాజికవర్గం వారిని అదుపులోకి తీసుకున్నారు.పటేళ్లు చేపట్టిన నిరసన ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపు చేయడం కోసం మెహ్సనా, సూరత్‌తో పాటు అహ్మదాబాద్ ప్రాంతాల్లో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేయించారు.
పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) రేపు గుజరాత్ బంద్‌కు పిలుపునిచ్చింది. పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గతేడాది నుంచి ఉద్యమం చేస్తున్న
సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్‌ను గతేడాది అక్టోబర్‌లో రాజద్రోహం కేసులో అరెస్ట్ చేశారు.