మళ్లీ మావోయిస్టుల కదలికలు

5

– వరంగల్‌ జిల్లాలో గ్రీన్‌హంట్‌ నిలిపివేయాలని వాహనానికి నిప్పు

వరంగల్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):  ప్రశాంతంగా ఉందనుకుంటున్న తెలంగాణా జిల్లాల్లోని కీలక మైన ప్రాంతంగా పేరున్న వరంగల్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చాలా రోజుల తర్వాత రెచ్చిపోయారు. దీంతో మావోల అలికిడి పోలీసులను ఆందోళనకు గురి చేస్తోంది. కేకే డబ్ల్యూ కార్యదర్శి దాఈమోదర్‌ పేరుతో తాడ్వాయి మండల కేంద్రంలోని వైల్డ్‌ లైఫ్‌ కార్యాలయంలో పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాన్ని దగ్దం చేశారు.గత రాత్రి 1గంటనుంచి  3గంటల మద్య కాలంలోకార్యాలయంలో నిద్రిస్తున్న వాచ్‌మెన్‌ వాచర్‌ నిద్రిస్తుండగా మఫ్టీలో ఉన్న  కొందరు వ్యక్తులు జీపుపై పెట్రోల్‌ పోసి దగ్దం చేశారు. ఈవిషయం తెలుసుకున్న వాచర్‌లేచి చూసి అవాక్కయ్యారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయిందని వాచర్‌ రవి తెలిపారు.  సంఘటన స్థలంలో  సిపిఐ మావోయిస్టు పార్టీ కరీంనగర్‌ ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కార్యదర్శి బడె చొక్కారావ్‌ అలియాస్‌ దామోదర్‌ పేరిట హెచ్చరిక లేఖ వదిలారు. గ్రీన్‌ హంట్‌ వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న హరిత హారం పేరిట గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఆలేఖలో డిమాండ్‌ చేశారు. ఇటీవల ప్రభుత్వం ఏటూర్‌ నాగారంను టైగర్‌ జోన్‌గా ప్రకటించిందని ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలలో మావోయిస్టుల సానుభూతి పరులను కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్‌ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని  వెంటనే కూంబింగ్‌లు నిలిపివేయాలని దామోదర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. వెంటనే అరెస్ట్‌లు ఆపకపోతే తగినమూల్యం చెకల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈసంఘటనతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.