మసకబారుతున్న మోడీ ప్రభ
సాధారణ ఎన్నికలకు ముందు ఆ తరవాత పరిస్తితులను బేరీజు వేసుకుంటే మోడీ హవా క్రమేపీ తగ్గుతోందని తెలుసుకోవచ్చు. ఆయన ప్రభ మసకబారుతుందన్న విమర్శలు మొదలయ్యాయి. ఇంత తక్కువ కాలంలో మోడీపై నిట్టూర్పులు రావడం ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతోంది. ఎన్నికలకు ముందు అన్నిటికీ మోడీయే మందు అన్న భావన కలిగింది. ప్రజలు అంతా మోడీ పీఠం ఎక్కితే చాలనుకున్నారు. మోడీ వస్తే అన్ని సమస్యలకు పరిస్కారం దక్కుతుందనుకున్నారు. పాలనలో వేగం పెరిగి సమస్యలు పరిసష్కారం అవుతాయని భావించారు. ఎన్నికల్లో బిజెపి విజయం మోడీ విజయంగానే భావించారు. ఆ తరవాత కూడా మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను అంతా స్వాగతించారు. అన్ని సమస్యలకు పరిస్కారం చూపే దిక్సూచిగా మోడీని భావిస్తూ వచ్చారు. భారత్‌లో ఒబామా పర్యటన వరకు మోడీ ప్రభ బాగానే వెలిగింది. కానీ ఎందుకనో ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరవాత గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. ఇక్కడ గ్రాఫ్ అంటే లెక్కలు కాదు. ప్రజల అభిప్రాయం మాత్రమే. ఇప్పుడంతా నిర్వేదంలో ఉన్నారు. ఎక్కడ చూసినా మోడీ పొడుస్తాడనుకుంటే చేసిందేవిూ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దీనికి కారణాలను ప్రజలు విశ్లేషించుకుంటున్నారు తప్ప బిజెపి విశ్లేషించుకోవడం లేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ప్రజలు మోడీ పట్ల తమలో ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ఢిల్లీకి ఏవిూ చేయలేదన్న భావన వారిలో కనిపించి బిజెపిని చిత్తుగా ఓడించారు. ఇక దాంతో ప్రాంభమైన పతనం ఇప్పుడు ముఫ్తీతో చేతులు కలిపి కాశ్మీర్‌లో సంకీర్ణం ఏర్పాటు చేసే వరకు సాగిందని చెప్పాలి. తీవ్రవాదులను వెనకేసుకుని వచ్చే సిఎంకు బిజెపి అండగా నిలవడం, 370 ఆర్టికల్‌పై రాజీపడడం వరకు చూస్తుంటే మోడీ ఛరిష్మాకు ఓ రకంగా వన్నె తగ్గిందనే చెప్పాలి. ఇదంతా ఇలావుంటే రైల్వే, సాధారణ బడ్జెట్లు కూడా సామాన్యలను సైతం ఆలోచించేవిగా చేశాయి. ఈ ప్రభుత్వానికి విజన్ లేదని చర్చ మొదలయ్యింది. ప్రజలకు మేలు చేసే ప్రకటనలు లేదా కార్యక్రమాలు జరగడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. . నిజానికి మోడీ అధికారంలోకి వచ్చాక రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని అందరూ భావించారు. అవినీతిపరుల ఆట కట్టిస్తారని, సిబిఐని బలోపేతంచేసి అవినీతి నేతలకు అరదండాలు వేస్తారని భావించారు. ధరలకు కళ్లెం వేస్తారని అనుకున్నారు. కానీ మోడీ ఇవేవీ చేయడం లేదు. వాటి జోలికి పోవడం లేదు. వేలకోట్ల ప్రజాధనం మెక్కిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కార్పోరేట్లకు మేలు చేసే నిర్ణయాలు తప్ప వేరే నిర్ణయాలు తీసుకోలేదు. ఇదంతా కమ్యూనిస్టులు విమర్శించి ఉంటే తప్పు పట్టేవాళ్లం. కానీ సామాన్యులే గొణుక్కోవడం వల్ల మోడీ ప్రభ మసకబారుతుందనే భావించాలి. ఇలాంటి ప్రచారం లేదా చర్చ మొదలయితే ఇక కోలుకోవడం వల్లకాదు. ఎన్డీయే ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పెట్టిన 2015-16 బడ్జెట్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మధ్యతరగతి ప్రజలని నిరాశ పరిచింది. ఉద్యోగుల ఆదాయం పన్ను మిన హాయింపు రాయితీల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వారి ఆశలను ఆడియాసలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక కేటాయింపులను మరచింది. అలాగే పునర్వ్యస్థీకరణ లోపాలను సరిదిద్దుతామని చెప్పి కేవలం మండలి సీట్లను పెంచేందుకు మాత్రమే బిల్లును పెట్టడం చూస్తే చిత్తశుద్ది లేదని తెలుస్తోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ప్రభుత్వంలో అనుభవజ్ఞులకు చోటు లేదు. అజమాయిషీ అసలు లేదని అర్థంఅ వుతోంది. ఏపీ, తెలంగాణాలో విభజన హావిూలను నెరవేరుస్తాం అన్నారు. బడ్జెట్‌లో ఏపీ రాజధాని నిర్మాణానికి ఇస్తామన్న నిధుల విషయం కనీసం ప్రస్తావించలేదు. అయితే పోలవరం ప్రాజెక్టుకు కేవలం 100 కోట్లు ప్రకటించడం అనేక విమర్శలకు దారితీస్తుంది. ఇలా అయితే మరో వందేళ్లయినా ప్రాజెక్టు పూర్తికాదని తెలుగుదేశం ఎంపీలు బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లబుచ్చారు. ప్రధానమంత్రి మోడీ మానసపుత్రిక ‘స్వచ్ఛభారత్’ ఇప్పుడో ప్రచార వేదికగా మారిందే తప్ప ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. అన్నింటినీ మించి పాలనపై పట్టుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రైల్వే బడ్జెట్‌లో అందరికీ అన్యాయం జరిగింది. కేటాయింపులు లేకున్నా ఊరడింపులు లేవు. బుల్లెట్ రైళ్లలా దూసుకెళతామని చేసిన ప్రకటనలకు బడ్జెట్‌లో వడ్డనలకు పొంతన లేకుండాపోయింది. జైట్లీ తన బడ్జెట్ లోనయినా స్వాంతన చేకూరుస్తారన్న ఆశలు ఆడిఆశలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో ఆంధప్రదేశ్‌కి ఇస్తామన్న ప్రత్యేక ¬దా విషయంపై కానీ, రాజధానికి కేటాయిస్తామన్న నిధుల విషయంలో కానీ కనీసం ప్రస్తావించ లేదు. తెలంగాణ విషయంలోనూ అదే జరిగింది. ఇక్కడున్న బిజెపి నేతలు కేంద్రం నుంచి సాయం కోరే బదులు ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, విమర్శించడానికే పరిమితం అయ్యారు. తెల్లవారింది మొదలు కెసిఆర్‌ను తిట్టడం తప్ప వారికి వేరే పనిలేకుండా పోయింది. ఎపిలో అసలు ప్రతిపక్షమనేది లేకుండా వ్యవహరిస్తున్నారు. చెడు ఎక్కడున్నా విమర్శించాల్సిందే. అయితే మోడీ వచ్చాక అవినీతి పరులపై గట్టివిచారణ సాగుతుందని భావించారు. యూపిఎ తప్పిదాల వల్ల కలిగిన నష్టాలను చట్టప్రకారం పూడుస్తారని భావించారు. కానీ అలాంటిదేవిూ జరగలేదు. అందుకే మోడీ ప్రభ తగ్గుతుందన్న భావన కనిపిస్తోంది. విదేశీ టూర్లు, కార్పోరేట్ల కనుసన్నల్లోనే సర్కార్ నడుస్తోందన్న భావన తొలగాలి. కింది స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించాలి. రాష్టాల్రను కలుపుకుని పోవాలి. ఉమ్మడి నిర్ణయాలకు కేంద్రంవేదిక కావాలి. పేదల సమస్యలపై నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని గుర్తిస్తారు. లేకుంటే అవకాశం వచ్చినప్పుడు ఢిల్లీలోలాగా పాతరేస్తారు.