మహాత్మాగాంధీ ప్రపంచశక్తి

3

జర్మనీలో జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

పలు కీలక సమావేశాల్లో పాల్గొన్న మోదీ

హనోవర్‌, ఏప్రిల్‌12(జనంసాక్షి) : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జర్మనీలోని హనోవర్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ యుగపురుషుడని, ఆయన చూపిన అహింసా మార్గం ఆచరణనీయమన్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందు ఉగ్రవాదం, గ్లోబల్‌ వార్మింగ్‌ రెండు ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. ఇక్కడ ఆయన జర్మన్‌ ఛాన్సెలర్‌ యాంజెలా మెర్కెల్‌తో భేటీ ఆయ్యారు. కేపిటల్‌ గూడ్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచంలోనే పెద్దదిగా పేరొందిన హనోవర్‌ ఫెయిర్‌ను ఆయన ప్రారంభించారు. వంద దేశాలనుంచి దాదాపు ఆరువేల మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పలువురు పారిశ్రామిక, వ్యాపార, రాజకీయ… వర్గాల నాయకులందరినీ కలిసిన ప్రధాని ద్వైపాక్షిక, వ్యాపారానికి సంబంధించి పలు అంశాలు చర్చించారు. బెర్లిన్‌లో ప్రధాని మోదీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ముని మనవడు సూర్యను కలుస్తారు. భారతదేశంలో మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం కాదని ఒక జాతీయస్థాయి ఉద్యమంగా మారనుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జర్మనీలోని హనోవర్‌లో జరిగిన పారిశ్రామిక ప్రదర్శనను ఆయన ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత్‌, జర్మనీలు సుదీర్ఘకాలం స్నేహపూర్వకదేశాలని పేర్కొన్నారు. భారత్‌ను పారిశ్రామికీకరణ కేంద్రంగా చేసేయత్నంలో జర్మనీ సహకారం అవసరమన్నారు. జర్మనీ ఎన్నో ఆవిష్కరణలు చేసిందన్నారు. భారత్‌లో ప్రపంచస్థాయి పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొందని, భారత్‌లోని యువతను నైపుణ్యంగా తీర్చిదిద్దుతామని, దీంతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ పేర్కొన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. భారత్‌ లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు.