మహిళలను ఆలయంలోని అనుమతించండి

4

– శనీశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత

– భూమతా బ్రిగేడ్‌ మహిళా సంఘం ఆందోళన

ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): మహరాష్ట్ర శనిసింగనాపూర్‌లోని శనీశ్వరాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు ఆలయ ప్రవేశాల్లో సమాన హక్కు ఉంటుందని.. వారిని ఎవ్వరూ అడ్డుకోకూడదని బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో తృప్తి దేశాయ్‌ నేతృత్వంలోని భూమాత బ్రిగేడ్‌ మహిళా సంఘం ఆలయం వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన మహిళలను పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయంలోకి వెళ్లేంత వరకు కదిలేదిలేదంటూ వీరంతా అక్కడే భీష్మించుకున్నారు. శనీశ్వరాలయంలోకి మహిళలను అనుమతించడంపై ఇప్పటికే ప్రభుత్వానికి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసిన పోలీసులు అడ్డుకోవడంపై మహిళలు మండిపడ్డారు. కోర్టు మమ్మల్ని ఆలయంలోకి అనుమతించాలని ఆదేశాలు జారీచేసినా పోలీసులు పాటించడంలేదని భూమాత బ్రిగేడ్‌ ప్రతినిధులు ఆరోపించారు.ఆలయంలోకి వెళ్లేంతవరకు ఇక్కడినుంచి కదిలేదిలేదంటూ తేల్చి చెబుతున్నారు. అనుమతించకుంటే సిఎం ఫడ్నవీస్‌పై కోర్టు ధిక్కరణ కేసు పెడతామని అన్నారు. మహారాష్ట్రలో శని శింగణాపూర్‌ శని దేవాలయంలోకి ప్రవేశించేందుకు తృప్తి దేశాయ్‌ నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బోంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పులో దేవాలయంలో ప్రవేశానికి పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులు ఉన్నట్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఓ మాజీ ఎమ్మెల్యే కూడా మహిళలకు మద్దతుగా శని దేవాలయం గర్భగుడిలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. దేవాలయ ట్రస్టు బోర్డు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందా? లేదా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలకు తమకు అందలేదని చెప్తోంది.మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో మహిళల హక్కులను కాపాడాలని పేర్కొంది.  దేవాలయంలో మహిళల ప్రవేశంపై తమకు అభ్యంతరాలు లేవని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు లింగ వివక్షకు వ్యతిరేకంగా సాధించిన విజయమని భూమాత బ్రిగేడ్‌ నేత తృప్తి దేశాయ్‌ పేర్కొన్నారు.