మాజీ స్పీకర్‌ సంగ్మా ఇకలేరు

3

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సంగ్మా హఠాన్మరణం

లోక్‌సభ సంతాపం…ఈశాన్య గొంతుకన్న కెసిఆర్‌

న్యూఢిలీ,మార్చి4(జనంసాక్షి): నిజాయితీ రాజకీయాలకు, నిబద్ద వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా నిలిచిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా(68) శుక్రవారం కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1947 సెప్టెంబరు 1న మేఘాలయాలోని వెస్ట్‌ గారోహిల్స్‌ ప్రాంతంలో సంగ్మా జన్మించారు. కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రాంభించిన ఆయన అధినేత్రి సోనియా దేశీయతపై బాణం ఎక్కుపెట్టారు. శరద్‌ పవార్‌తో కలసి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ఎన్సీపని స్థాపించారు. షిల్లాంగ్‌లోని సెయింట్‌ ఆంథోనీస్‌ కళాశాలలో బీఏ హానర్స్‌ పూర్తిచేశారు. 1996 నుంచి 1998 వరకు 11వ లోక్‌సభకు ఆయన సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1996 నుంచి 1998 వరకు లోక్‌ సభ స్పీకర్‌ గా వ్యవహరించిన సంగ్మా, ప్రస్తుతం తురా(మేఘాలయ) ఎంపీగానూ కొనసాగుతున్నారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌ పీపీ)కి ఆయన అధ్యక్షుడు కూడా. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అజాత శత్రువుగా పేరుపొందిన ఆయన గిరిజనుల అభ్యున్నతికోసం కృషిచేశారు. సంగ్మాకు భార్య, కుమార్తె అగాథా, కుమారులు కొన్రాడ్‌, జేమ్స్‌ సంగ్మాలు ఉన్నారు. ఆయన ముగ్గురు పిల్లలు కూడా రాజకీయరంగంలో రాణిస్తుండటం గమనార్హం. అగాథా సంగ్మాకు పార్లమెంట్‌ కు ఎన్నికైన అతిపిన్న

వయస్కురాలిగా రికార్డుఉంది.1988-1990 మధ్య మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మేఘాలయలోని తురా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2013 జనవరి 6న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీని స్థాపించారు. సంగ్మా పూర్తిపేరు పూర్ణో అజితోక్‌ సంగ్మా. 1947, సెప్టెంబర్‌ 1న మేఘాలయా పశ్చిమ గారో పర్వత ప్రాంతంలోని ఛాపతి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు మరక్‌ సంగ్మా, చింగ్మీ సంగ్మా. షిల్లాంగ్‌ లోని ఆంటోనీ కాలేజీలో బీఏ(హానర్స్‌)  పూర్తిచేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేశారు. కాలేజీ చదువుల అనంతరం పూర్తికాలం రాజకీయనేతగా కెరీర్‌ ప్రారంభించిన సంగ్మా.. 1973లో మేఘాలయ యూత్‌ కాంగ్రెస్‌ కమిటీకి ఉపాధ్యక్షుడయ్యారు. తర్వాతి ఏడాది ఆ విభాగానికి జనరల్‌ సెక్రటరీ అయ్యారు. 1975-1980 మధ్య కాలంలో మేఘాలయ పీసీసీ సెక్రటరీగా వ్యవహరించారు. తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి 1977లో 6వ లోక్‌ సభకు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన సంగ్మా ఇప్పటికీ ఎంపీగానే కొనసాగుతుండటం విశేషం. 1996 మే 25 నుంచి 1998 మార్చి 23 వరకు 11వ లోక్‌ సభకు లోక్‌ సభ స్పీకర్‌ గా వ్యవహరించారు. కేంద్రమంత్రి వర్గంలోనూ పలు శాఖలు నిర్వహించిన సంగ్మా.. 1988 నుంచి 1990 వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటుపై మళ్లీ కేంద్ర పదవులు చేపట్టారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై 1999లో తిరుగుబావుటా ఎగరేసిన పీఏ సంగ్మా.. శరద్‌ పవార్‌, తారీఖ్‌ అన్వర్‌ లతో కలిసి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటుచేశారు. అయితే 2011లో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవాలనుకున్న ఆయన నిర్ణయాన్ని ఎన్సీపీ సమర్థించకపోవడంతో ఆ పార్టీని వీడి సొంతగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌ పీపీ)ని స్థాపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీపై పోటీచేసి ఓటమిపాలయినప్పటికీ గిరిజన నేతగా ఆయన చేసిన రాజకీయపోరాటం చరిత్రలో నిలుస్తుంది. సంగ్మా మృతి పట్ల లోక్‌సభ సంతాపం తెలిపింది. సంతాపంగా ఈనెల 8 వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.

ఈశాన్య ప్రజల గొంతుక సంగ్మా: కేసీఆర్‌

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సంగ్మా మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన సమర్థంగా పనిచేశారని కొనియాడారు. సంగ్మా ఈశాన్య ప్రజల గొంతుకగా నిలిచారన్నారు. ప్రత్యేక తెలంగాణకు ఆయన మద్దతు,నైతిక మద్దతు ఇచ్చారని అన్నారు.