మాటలకే పరిమితమైన మంత్రులు
కడప, ఆగస్టు 3 : కాంగ్రెస్ పార్టీలో మేథోమధనం జరపాలని రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతరావు కొన్ని గంటల పాటు చేసిన మౌనదీక్షకు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంఘీభావం తెలపడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఎద్దేవా చేశారు. సిఎం కుర్చీలో ఎవరు ఉన్నా.. వారికి వ్యతిరేకంగా పనిచేశారే తప్ప ఏనాడు పార్టీ బలోపేతానికి రవీంద్రారెడ్డి చేసిన కృషి ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే వారి సమస్యల పట్ల మంత్రి ఏనాడూ స్పందించలేదని దుయ్యబట్టారు. ఇటీవల మూడు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మంత్రి పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఏ విధంగానూ ప్రయత్నించలేదని విమర్శించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ కొరత ఉందని తెలిసినా.. సీనియర్ నాయకునిగా.. మంత్రిగా.. ఉన్న డిఎల్ చేసిందేమిటని ప్రశ్నించారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి, నాయకుల మధ్య సమన్వయానికి ఎలాంటి కృషి చేయని డిఎల్ విహెచ్ మౌనదీక్షకు సంఘీభావం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు డిఎల్ వ్యవహారాన్ని గమనిస్తునే ఉన్నారని ఆయన చెప్పారు. ఇక ప్రత్యేక రాయలసీమ కోసం టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆందోళనకు దిగుతానని చెప్పడం కూడా మంచిది కాదన్నారు. సమైక్యవాదులందరూ రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకు దాదాపు 40 రోజుల పాటు దీక్షలు, నిరసనలు చేశారని చెప్పారు. ప్రత్యేక రాయలసీమ వల్ల ఈ ప్రాంతానికి ఒనకూడే అదనపు ప్రయోజనాలేమిటో చెప్పాలని డిమాండు చేశారు. తెలుగు భాష వారంతా సమైక్యంగా ఉండాలన్నదే తమ కోరికగా ఆయన స్పష్టం చేశారు.