‘మా’ అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌

1

జయసుధపై 69 ఓట్ల ఆధిక్యం

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్కంఠకు తెరదించుతూ సినీ కళాకారుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సినీనటుడు రాజేందప్రసాద్‌ విజయం సాధించారు. ఆయన తన సవిూప ప్రత్యర్థి నటి జయసుధపై 69 ఓట్ల ఆధిక్యంతో రాజేందప్రసాద్‌ గెలుపొందారు. కోర్టు గడప తొక్కిన మా ఎన్నికల వ్యవహారం చివరకు  కోర్టు ఆదేశంతోనే ఫలితాన్ని ప్రకటిండం విశేషం. గతనెల29న జరిగిన  మా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకు గాను 392 ఓట్లు పోలయ్యాయి.ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థి నటి జయసుధపై 69 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రాజేంద్ర ప్రసాద్‌ విజయం సాధించడంతో ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికయ్యారు. దీంతో రాజేందప్రసాద్‌ మద్ధతుదారులు ఫిల్మ్‌ఛాంబర్‌ వద్ద సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా, మా ఎన్నికలను నిలిపివేయాలంటూ సిటీ సివిల్‌కోర్టులో నటుడు ఒ.కళ్యాణ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించారు.  గత నెల 29న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఎన్నడూ లేని విధంగా సహజనటి జయసుధ, నటకిరీటి రాజేందప్రసాద్‌ పోటీ పడ్డారు. ఇరువురి ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగాయి. పేద కళాకారుల కోసం ఒకరిని మించి ఒకరు హావిూల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయంటూ నటుడు కల్యాణ్‌ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. ఫలితాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరగగా మొత్తం 702 మంది సభ్యుల్లో కేవలం 394 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పక్రియనంతా చిత్రీకరించిన ఎన్నికల అధికారులు ఆ సీడీలను కోర్టుకు సమర్పించారు. ‘మా’ ఎన్నికలపై ఇరువర్గాల వాదనలు విన్న సివిల్‌ న్యాయస్థానం కల్యాణ్‌ ఫిర్యాదును కొట్టివేసింది. దీంతో ‘మా’ అధ్యక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమం కావడంతో ఎన్నికల అధికారులు శుక్రవారం  ఫిల్మ్‌ చాంబర్‌లో ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. చివరికి ‘మా’ అధ్యక్ష పీఠం రాజేందప్రసాద్‌ను వరించింది.ఊహించని పరాజయంతో జయసుధ, మురళీమోహన్‌ కంగుతిన్నారు. సినీ ట్విస్టులను తలపించిన మా ఎన్నికల ప్రస్థానంలో క్లైమాక్స్‌ తరహాలోనే కౌంటింగ్‌ కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. కార్యనిర్వహాక అద్యక్షుడిగా తనికెళ్ల భరణి కి 185 ఓట్లు ,కార్యదర్శిగా శివాజీ రాజకు 36 ఓట్లు ఆధిక్యతతలో గెలిచారు .కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు నెగ్గారని ఆయన తెలిపారు .కార్యవర్గ సభ్యులుగా బెనర్జీ, బ్రహ్మాజి, చార్మి, డిల్లీ రాజేశ్వరి, ఏడిద శ్రీరామ్‌, మహర్షి రాఘవ, శశాంక, గీతాంజలి, ఎమ్‌.హరనాధ్‌బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కృష్ణుడు, నర్సింగ్‌ యాదవ్‌, పర్చూరి శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, రాజివ్‌ కనకాల గెలుపొందరు.

ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా

సినీ కళాకారుల సంఘం .. ‘మా’ ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికయ్యారు. రాజేందప్రసాద్‌ ప్యానెల్‌ నుంచి పోటీ చేసిన నలుగురు ఎన్నికయ్యారు. మా ఎన్నికల్లో రాజేందప్రసాద్‌ విజయం సాధించడతో ఆయన వర్గీయులు ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ… హావిూలు నెరవేర్చినప్పుడే తమ విజయానికి సార్థకత ఉంటుందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని శివాజీరాజా స్పష్టం చేశారు. మా గెలుపులో

విూడియాదే ప్రధాన పాత్ర అని నటుడు శివాజీ రాజా అన్నారు. విూడియా సహకారం మరవలేనిదని తెలిపారు. గెలిచిన వారందరికీ శివాజీ అభినందనలు తెలియజేశారు. తమ ప్యానల్‌లో నలుగురూ గెలిచారన్నారు. ఇచ్చిన హావిూల అమలుకు కృషి చేస్తామని శివాజీరాజా స్పష్టం చేశారు.

ఈ ఓటమి మురళీమోహన్‌ది

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓడినది జయసుధ కాదని, మురళీ మోహనే ఓడిపోయారని పలువురు వ్యాఖ్యానించారు. సీనియర్‌ నటుడు విజయచందర్‌ అచ్చంగా ఇవే వ్యాఖ్యలు చేశారు. రాజేందప్రసాద్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏవేం చెప్పారో అన్నీ చేయాలని ఆయన కోరారు. ఒకసారి పోటీచేసి, ఓడిపోయిన ఆయన.. కళాకారులకు ఏదో చేయాలన్న తాపత్రయంతో ఉన్నారని, అలా కాకుండా చిట్టచివరి నిమిషంలో జయసుధను తీసుకొచ్చి రంగప్రవేశం చేయించారని ఆయన అన్నారు. ఇది జయసుధ ఓటమి కాదని.. కేవలం మురళీమోహన్‌ ఓటమేనని ఆయన స్పష్టం చేశారు. మా కార్యాలయాన్ని కేవలం ఒక పార్టీ కార్యాలయంగా ఆయన మార్చేశారని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా కళాకారులంతా ఒక్కతాటిపై ఉండాలని, కానీ ఆయన దీన్ని ఒక పార్టీ వేదికగా మార్చేశారని మండిపడ్డారు.

ఏకగ్రీవం కోసం ప్రయత్నించామన్న నాగబాబు

మా అధ్యక్ష పదవికి రాజేందప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ముందునుంచి భావించినట్లు మా సీనియర్‌ సభ్యుడు, నటుడు నాగబాబు తెలిపారు. తాము జయసుధకు వ్యతిరేకం కాదని.. అయితే నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేందప్రసాద్‌ అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి ఆయనకు మద్దతు తెలిపామన్నారు. ఈ ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని, అయితే ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించినట్లు నాగబాబు చెప్పారు. రాజేందప్రసాద్‌ గెలవాలని కోరుకున్నాను గానీ.. చివరకు ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్లు నాగబాబు అన్నారు. మా సభ్యత్వ రుసుము తగ్గించాలని, ఇది చాలామందికి దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ రుసుము ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలుందని, ఎక్కువమంది సభ్యులు చేరేలా చూడాలని తెలిపారు. పేద, వృద్ధ కళాకారులకు పింఛను అందించాలని, కనీసం 50-60 మంది వరకు ఇవ్వాలని అన్నారు. అలాగే మెడిక్లెయిమ్‌ సదుపాయం కూడా అవసరమని.. ఈ మూడూ తప్పనిసరిగా చేసి తీరాలని నాగబాబు ఆకాంక్షించారు. మా ఎన్నికల సందర్భంగా తొలి దశలో జరిగిన కొన్ని పరిణామాలు తమకు మనస్తాపం కలిగించినా, కోర్టు వరకు వెళ్లాలన్న ఆలోచన రాలేదని నాగబాబు తెలిపారు. అయితే ఈ పరిణామాలు మరో నటుడు ఓ కళ్యాణ్‌కు  నచ్చకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్లారని తెలిపారు.