మా టీచర్ నన్ను టెర్రరిస్టు అంటోంది
– అమెరికాలో 12 ఏళ్ల ముస్లిం విద్యార్థి ఫిర్యాదు
టెక్సాస్,ఏప్రిల్ 4(జనంసాక్షి): తనను తమ తరగతి ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థుల ముందు ప్రతిరోజు అవమానిస్తోందని పన్నెండేళ్ల ముస్లిం బాలుడు ఫిర్యాదు చేశాడు. తన మతాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి రోజు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, ఉగ్రవాదినని పిలుస్తూ బొమ్మతుపాకీలతో బెదిరిస్తూ ఆట పట్టిస్తున్నారని వాపోయాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వలీద్ అబుష్బాన్ అనే విద్యార్థి ఫస్ట్ కాలనీ మిడిల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తాను తనతోటి విద్యార్థులతో కలిసి
‘బెండ్ ఇట్ లైక్ బెక్కామ్’ అనే చిత్రాన్ని వీక్షిస్తుండగా అందులో వచ్చిన ఓ హాస్యాస్పద సన్నివేశానికి తాను గట్టిగా నవ్వానని, ఆ సమయంలో తన టీచర్ అలా నవ్వొద్దని గదమాయించదని చెప్పాడు. అలా ఎందుకు నవ్వకూడదని ప్రశ్నిస్తే ‘మేమంతా నిన్ను ఉగ్రవాది అని అనుకుంటున్నాము. అందుకే నువ్వు నవ్వకూడదు’ అని అన్నారని తెలిపాడు. తనను బాంబు అని పేరు పెట్టి పిలుస్తున్నారని, అంతా కలిసి మేం బాంబును చూశాం బాంబును చూశాం అని తనవైపు చూపిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆ బాలుడు ఏడుస్తూ చెప్పాడు. ఈ ఫిర్యాదు స్వీకరించిన అమెరికా అధికారులు ఆ టీచర్ పై దర్యాప్తు ప్రారంభించాడు.