మా సర్కారు రైతులకు వ్యతిరేకం కాదు
రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంపై మోదీ నిర్వేదం
విద్యుత్ ఆదా చేస్తే దేశాభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీ
ఖండ్వా,మార్చి5(జనంసాక్షి): బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక సర్కారు కాదని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా 204 బొగ్గు గనులను ఎలా కేటాయించారని మోదీ ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక ఇంటి నుంచి సందేశం వెళ్లేది. మరో ఇంటి నుంచి ఇంకో చీటీ వెళ్లేది. అందులో సూచించిన వారికి కళ్లుమూసుకుని బొగ్గు గనులు కేటాయించేవారని ప్రధాని ఆరోపించారు. ప్రజలకు ఏమవుతుందో ఆలోచించకుండా .. 204 బొగ్గు క్షేత్రాలను చీటీ ఆధారంగా కేటాయించారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు బొగ్గు కేటాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేసి వాటిని రద్దు చేసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఆ క్షేత్రాలన్నింటినీ వేలం ద్వారా కేటాయించాలని వంద రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. నేను ఢిల్లీలో ప్రధానిగా కాదు దేశ ఖజానాకు సంరక్షకుడిగా పని చేస్తానని గతంలో చెప్పేవాడిని. విూకిచ్చిన హావిూకి కట్టుబడి పనిచేస్తున్నానని తెలిపారు. రాజ్యసభలో సంఖ్యబలంపై మోడీ నిర్వేదం చెందుతున్నారు. రాజ్యసభలో ఆధిక్యంతో ప్రగతి రథాన్ని అడ్డుకోవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఆదా చేయడమూ దేశభక్తిలో భాగమేనని, తద్వారా దేశాభివృద్ధికి దోహద పడుతుందని మోడీ పిలుపునిచ్చారు. గ్రావిూణాభివృద్ధికోసమే భూసేకరణ చట్టంలో సవరణలు చేశామని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు.