ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి
కడప, జూలై 8 : బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యలను 20 రోజుల్లో పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ముంపు బాధితులు వెంకటరమణ, ఓబులయ్య ఒక ప్రకటనలో హెచ్చరించారు. అవసరమైతే జంగంరాజుపల్లి వద్ద నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తామని వారు హెచ్చరించారు. ముంపు బాధితులకు ప్రభుత్వం 95వేల రూపాయలు అదనంగా ఇస్తామని ప్రకటించిందన్నారు. 2005లో తమ గ్రామాలను ఖాళీ చేయించారని, దీంతో బసాపురం, ఓబులరాజుపల్లి, గొల్లపల్లి, జంగంరాజుపల్లి తదితర గ్రామాల ప్రజలు ఖాళీ చేశారని అన్నారు. అయినా ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదన్నారు. దీంతో ఆందోళన చేయకతప్పడంలేదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు 20 రోజుల్లోగా తమ సమస్యలను పరిష్కరించాలన్నారు.