ముంపు మండలాలపై భగ్గుమన్న సభ
బడ్జెట్‌పై భట్టి విమర్శలు, తిప్పికొట్టిన ఈటెల
హైదరాబాద్,మార్చి16(జనంసాక్షి): ముంపు మండలాల విలీన అంశంపై తెలంగాణ శాసనసభ భగ్గుమంది. ఈ అంశానికి సంబంధించి సభలో కాంగ్రెస్, తెరాస, భాజపా సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముంపు మండలాల విషయంలో ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ విమర్శించింది. విపక్షనేత జానా సభలో లేకపోవడంతో సభ్యులు సర్కార్‌పై ఆరోపణల పర్వానికి తెరతీశారు. ముంపు మండలాల విలీనానికి బిజెపి , కాంగ్రెస్‌లు కారణమని టిఆర్‌ఎస్ ఎదురుదాడికి దిగింది. చర్చ నేపథ్యంలో ప్రభుత్వ సమాధానం వినకుండానే సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ప్రోద్బలంతోనే 7 మండలాల విలీనం జరిగిందని విమర్శించారు. 7 ముంపు మండలాలు పోతేపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పలేదా? అని అన్నారు 7 మండలాల విలీనానికి కేసీఆర్ అంగీకరించినట్లే కదా అని వ్యాఖ్యానించారు. 7 మండలాలు తిరిగి సాధించుకునేందుకు దిల్లీకి అఖిలపక్షం అన్నారు.. అది ఏమైందని ప్రశ్నించారు. ముంపు మండలాల విలీన అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పక్ష్యాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రతిపక్షనేత జానారెడ్డి సభలో లేకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడు పెంచారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అధికార టీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టే యత్నం చేశారు. ఖమ్మం జిల్లా మండలాలు ఎపిలో కలవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. బిల్లు తయారు చేసిందే కేంద్ర మంత్రి జయరామ్ రమేష్ అని ఆయన అన్నారు. ఆ తర్వాత కేంద్రం ఈ బిల్లు తెచ్చినప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. దీనిపై సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ జై రామ్ రమేష్ కు దీనితో ఏమి సంబందం అని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు ఈ బిల్లును ఆమోదింప చేసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. కాగా ఆ తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన పువ్వాడ కు అవగాహన లేకపోవచ్చని, కాని చిన్నారెడ్డి కి విషయాలు తెలియవా అని అన్నారు. అయితే తనను పార్టీ మారారని, అవగాహన లేదన్న అభిప్రాయంపై పువ్వాడ అభ్యంతరం చెప్పారు. తనను కించపరిచేలా హరీష్ రావు మాట్లాడారని ,కెసిఆర్ కూడా పార్టీ మారారని అన్నారు. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తనకు అజయ్ ను కించ పరిచే ఉద్దేశం లేదని అన్నారు. చర్చ మధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడంతో సభలో దుమారం రేగింది. స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క ప్రకటనతో ప్రభుత్వ సమాధానం వినకుండానే వాకౌట్ చేశారు.
తిప్పికొట్టిన ఈటెల
చర్చ సందర్భంగా తెలంగాణ ఆర్థిక బడ్జెట్ ఎవరో రాసిస్తే చదివిన బడ్జెట్ గా ఉందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ అంచనాలకు హావిూలకు పొంతన లేదన్నారు. అయితే భట్టి ఆరోపణలను ఆర్థికమంత్రి ఈటెల సమర్థంగా తిప్పికొట్టారు. భట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఈటెల మండిపడ్డారు. కరెంట్ విషయంలో అవగాహన లేమితో భట్టి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వాస్తవ అంకెలతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బాగోదు అని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నెరవేర్చే దిశలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. గ్రావిూణ ప్రాంతాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 50 వేల వరకు ఆదాయ పరిమితిని పెంచామని తెలిపారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి తానే ప్రసంగించి నిరసనగా వాకౌట్ చేయడం ఏ సంప్రదాయమని ప్రశ్నించారు.