ముంబై మునక
– భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం
ముంబయి,జూన్19(ఆర్‌ఎన్‌ఎ): ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో జనజీవనం స్థంభించిపోయింది. వర్షాల వల్ల రైల్వే ట్రాక్‌లపై నీరుచేరడంతో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.దీంతో అదనపు బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబయి నగరంలో ప్రతి రోజు దాదాపు 70నుంచి 80లక్షల మంది లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. వర్షాల కారణంగా ఒక్కసారిగా రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలని లేకపోతే వారి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచించారు.భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలమవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సవిూక్షించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కంట్రోల్ రూంలో కూర్చొని ఆయన అత్యవసర అవసరాలు, సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయక చర్యలు చేపట్టాలని అదికారులను ఆదేవించారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ఎక్కడ చూసినా మోకాలి వరకూ నీళ్లు నిలిచిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. బాంబే హైకోర్టు సహా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. బస్సులు, ఆటోలు, రైళ్లు నిలిచిపోయాయి. ముంబయి నుంచి వెళ్లాల్సిన, నగరానికి రావాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదిలావుంటే ముంబయిలో వర్షపు నీటిని పంప్ చేయడానికి ఏర్పాటు చేసిన రెండు పంపింగ్ స్టేషన్లు పనిచేయకుండా పోయాయి. ఈ నీటిని తోడేందుకు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) రూ.112కోట్లతో నిర్మించింది. సెకనుకు 6000 లీటర్ల నీటిని తోడివేసే సామర్థ్యంతో వాటిని ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలం మొదట్లో కురిసిన వర్షాలకే అవి పనిచేయకుండా పోయాయి. దీంతో వాటిపై పెట్టిన పెట్టుబడి వ్యర్థంగా మారింది. ముంబయిలో భారీ వర్షాలు, తుపాను కారణంగా సముద్రంలో భారీ అలలు వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో వర్షాల కారణంగా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నగరమంతా జలమయమయ్యింది. ఉదయమే అధికారులు భారీ అలలు వస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సముద్రంలో భారీ అలలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. అలలు ఎగిసిపడే ప్రమాదముందని చెప్పారు. ప్రజలను సముద్ర తీర ప్రాంతం వైపు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. ఈ పరిస్థితిని పరిశీలించిన సిఎం తక్షణ చర్యలకు ఆదేశించారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు రవాణ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు.