ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటన – వివరాలు :
నిజామాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సోమవారం మధ్యాహ్నం హెలీకాప్టర్లో నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం :
అక్కడి నుంచి సీఎం ప్రత్యేక బస్సులో నిజామాబాద్ లోని ఎల్లమ్మగుట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్క నాటిన సీఎం, టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో పూజలు జరిపి, పార్టీ ఆఫీసుతోపాటు, మీటింగు హాలును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆయన చాంబర్లోని కుర్చీలో కూర్చుండబెట్టిన సీఎం, ఆయన్ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
అక్కడి నుంచి బయలుదేరిన సీఎం నిజామాబాద్ బైపాస్ రోడ్డు వద్ద కొత్తగా నిర్మించిన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే జిల్లా నేతలు, అధికారులు స్వాగతించారు. వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ :
ఆ తర్వాత 25 ఎకరాల్లో రూ.53.52 కోట్లతో దాదాపు 1 లక్ష 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ సముదాయం శిలా ఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి, కలెక్టరేట్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సరస్వతీ పూజ చేశారు. కలెక్టర్ ఛాంబర్లోని కుర్చీలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కూర్చుండబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటు, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్ కు కలెక్టర్ శాలువాలు కప్పి, సన్మానించి, మెమెంటోలు బహూకరించారు. అలాగే, కలెక్టరేట్ నిర్మాణంలో భాగస్వాములైన వారికి సీఎం కండువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోని అన్నిరాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తున్న క్రమంలో ‘క్రెస్ట్ ఫర్ ఎక్సలెన్స్’ కొనసాగుతున్నదన్నారు. ఈ అభివృద్ధిని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, కొత్త కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్.సురేష్ రెడ్డి, బీబీపాటిల్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వి.గంగాధర్ గౌడ్, బి.రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మహ్మద్ షకీల్, గంప గోవర్దన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మేయర్ దండు నీతూకిరణ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆరుట్ల రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, కామారెడ్డి జెడ్పీ చైర్మన్ దఫేదార్ శోభ తదితరులు పాల్గొన్నారు.