ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం

5

హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు కాలిఫోర్నియా గవర్నర్‌ ఎడ్మండ్‌ జి బ్రౌన్‌ నుంచి గురువారం ప్రత్యేక ఆహ్వానం అందింది. పలు కార్యక్రమాల ద్వారా వాతావరణ మార్పు సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్న నేపథ్యంలో కాలిఫోర్నియా గవర్నర్‌ ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సోలార్‌ ఎనర్జీ ప్రణాళికలను ప్రత్యేకంగా ప్రశంసించారు. కేసీఆర్‌ చేపట్టిన విధానాలు ఈ శతాబ్దాంతానికి గ్లోబల్‌ వార్మింగ్‌ రెండు డిగ్రీల వరకు తగ్గించాలన్న ప్రపంచ దేశాల లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఉన్నాయన్నారు.కాలిఫోర్నియా, తెలంగాణ రాష్ట్రాలు వర్షాభావం, గ్రీన్‌ కవర్‌ తగ్గడం వంటి ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని.. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో వచ్చే జూన్‌ లో జరగనున్న ‘సబ్‌ కాంటినెంటల్‌ క్లీన్‌ ఎనర్జీ మినిస్టీరియల్‌’ సమావేశానికి హాజరుకావాల్సిందిగా కేసీఆర్‌ ను కోరారు. ఈ సదస్సులో క్లీన్‌ ఎనర్జీ రంగంలో చేపట్టిన పలు ఇన్నోవేటివ్‌ ప్రణాళికలను చర్చించాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్‌ పంపిన ప్రత్యేక ఆహ్వానాన్ని అసిస్టెంట్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఏషియా నిశా బిశ్వాల్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావుకు అందించారు. మంత్రితో జరిగిన సమావేశంలో తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిశాబిశ్వాల్‌ కు కేటీఆర్‌ వివరించారు. ప్రధాని మోదీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు తమ ప్రభుత్వ న్యూ ఇండస్ట్రియల్‌ పాలసీని ప్రశంసించారని కేటీఆర్‌ చెప్పారు.తెలంగాణ ప్రభుత్వ పనితీరుపైన ఇప్పటికే అమెరికాలోని వ్యాపార వర్గాల్లో సానుకూల దృక్పథం మొదలైందని నిశా బిశ్వాల్‌ చెప్పారు. పరిశ్రమ వర్గాలతో కలిసి నైపుణ్య శిక్షణ కోసం పనిచేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. కాలిఫోర్నియాలోని ఐ హబ్‌ తో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్‌ భాగస్వామ్యానికి కృషి చేస్తానని నిశా బిశ్వాల్‌ హావిూ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ మైకెల్‌ మలిన్స్‌ ఉన్నారు.