ముగిసిన మోదీ విదేశీ పర్యటన

4

నేడు భారత్‌కు ప్రధాని

న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 17(జనంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు పర్యటనలో మోదీ కెనడాలోని వాంకూవర్‌ నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో కెనడా ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌ కూడా పాల్గొన్నారు. అక్కడ ఉన్న ఖల్సా దివాన్‌ గురుద్వారాను వారు సందర్శించారు. సిక్కు మత ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా గురుద్వార నిర్వాహకులు నరేంద్ర మోదీ, స్టీఫెన్‌ హార్పర్‌లకు సంప్రదాయ ఖడ్గాలను బహుకరించారు. ఆ తరువాత మోదీ కెనడాలోని సిక్కులనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర సంగ్రామంలో భగత్‌ సింగ్‌ వారసులుగా సిక్కుల పోరాటాలను ఆయన గుర్తుచేశారు. శ్రమతత్వం కలిగిన పంజాబీలు దేశాంతరాల్లో భారత కీర్తిని చాటుతున్నారని ప్రశంసించారు. అనంతరం ఇద్దరు ప్రధానులు కలిసి సుప్రసిద్ధమైన లక్ష్మీనారాయణ మందిరాన్ని సందర్శించారు. అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత ప్రధాని మోదీ వాంకూవర్‌లోని భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. హిందుత్వం ఒక మతం కాదని, జీవన విధానం మాత్రమేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచానికి భారతదేశం యోగాను కానుకగా ఇచ్చిందని పేర్కొన్నారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడానికి ఐక్యరాజ్య సమితో 171 దేశాలు మద్దతిచ్చిన సందర్భాన్ని మోదీ అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. వాంకూవర్‌ సందర్శనతో ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన పూర్తయింది. తొమ్మిది రోజుల పర్యటనలో ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా దేశాల్లో మోదీ బృందం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. కాగా ప్రధాని మోదీ భారత్‌కు బయలుదేరే ముందు కెనడా ప్రధాని హార్పర్‌ విందు ఏర్పాటు చేశారు. విందు అనంతరం ప్రధాని భారత్‌ బయల్దేరిన ప్రధాని శనివారం ఉదయం భారత్‌ చేరుకోనున్నారు.