ముఫ్తీ వ్యాఖ్యలు సమర్థించం
మిలిటెంట్లకు భయపడం
భూసేకరణ చట్టం సవరించి తీరుతాం..మోదీ
న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ వ్యాఖ్యలను బీజేపీ సమర్థించబోదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మిలిటెంట్లకు భయపడేదిలేదని స్పష్టంచేశారు. భారతదేశ ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. ప్రజాస్వామ్యంలో బెదరింపులకు తావు లేదని, అందరం కలసి దేశాన్ని అభివృద్ది చేసుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదం తెలిపే తీర్మానంపై ఆయన రాజ్యసభలో ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు పనిచేయవని, తన అభిమతం కూడా అది కాదని అన్నారు. బెదరింపులు ఎవరు చేశారు తాను గుజరాత్లో ఉండగా తనను ఎలా బెరించారో అందరికీ తెలుసన్నారు. కానీ దేనికి తాను వెరవలేదన్నారు. ఈ దేశాన్ని నిర్మించింది మహానుభావులే తప్ప రాజకీయ నాయకులు కాదని తెలిపారు. రాజకీయ నేతలే దేశాన్ని నడిపించగలరని స్పష్టం చేశారు. ప్రజలు ఈ దేశాన్ని ముందుకు నడిపే బాధ్యతను మాకిచ్చారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని వెల్లడించారు. దేశం నలు మూలలా బీజేపీని ప్రజలు గెలిపించారని ప్రధాని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా పార్లమెంట్ నడుచుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నాం కదా అంతా మాకే తెలుసనే భావన తనలో లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులతో గొడవ పెట్టుకునే కంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలమనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. అందరం కలిసి దేశాభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. దేశ పురోగతిలో అందరం చేయిచేయి కలపాలని కోరారు.
పథకాల పేర్లు మార్చింది కాంగ్రెస్సే
ప్రభుత్వ పథకాల పేర్లు మార్చింది తాము కాదని గతంలో యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ పథకాల పేర్లు మార్చారని మోదీ విమర్శించారు. వాజ్‌పేయ్ హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వ పథకాలను యూపీఏ కాపీ కొట్టిందని వివరించారు. ఏయే పథకాన్ని మార్చి ఏ పేరు పెట్టారో ఆయన పేర్లతో సహా వెల్లడించారు. కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం పథకాలు చేపడుతుందని ప్రతిపక్షాలు చేస్తూ వస్తోన్న విమర్శలను మోదీ తోసిపుచ్చారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛ్‌భారత్ కార్పొరేట్ల కోసం చేస్తున్న పథకాలేనా అని ప్రశ్నించారు. పేదలకు బ్యాంక్ అకౌంట్ ఉండడం, పరిశుభ్రమైన వాతావరణం కోరుకోవడం కార్పోరేట్ల కోసమా అని ప్రశ్నించారు. పేదలు ధనవంతులు కావాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కేంద్ర పన్నుల్లో రాష్టాల్రకు 42 శాతం వాటా ఇచ్చామని తెలిపారు. దేశాభివృద్ధిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పేదలు ధనవంతులు కావాలన్నదే తమ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, అదే తమ సంకల్పమని ప్రధాని తెలిపారు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. నిరుపేదలకు నాణ్యమైన జీవనం అందిండచమే ధ్యేయమని, దేశంలో అందరికీ స్వంత ఇళ్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. చాలా చోట్ల పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, దీంతో విద్యార్థులు బడికి వెళ్లడం మానివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భూసేకరణ సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది
తూ భూసేకరణ సవరణ బిల్లు త్వరలో ఆమోదం పొందుతుందన్నారు. ఈ బిల్లుపై అవాస్తవాలను ప్రచారం చేయొద్దన్నారు. పన్నుల వాటా కింద పశ్చిమబెంగాల్ కు అదనంగా ఇరవై రెండువేల కోట్లు, ఎపికి 15 వేల కోట్లు,ఒడిషాకు ఎనిమిది వేల కోట్లు నిధులు ఆర్ధిక సాయంగా లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.రాష్టాల్రకు అరవై రెండు శాతం నిధులు వెళుతున్నాయని, కేంద్రానికి ముప్పై రెండు శాతం నిధులే ఉంటాయని ఆయన చెప్పారు. గతానికి పూర్తి విరుద్దంగా ఈ నిదులు కేటాయింపు జరుగుతోందని ఆయన చెప్పారు. రాజ్యసభలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొత్తం ప్రత్యేకంగా ఇస్తున్నారా?లేక ఆర్దిక సంఘం సిఫారస్ ల ప్రకారం ఇస్తున్నారా అన్నది స్పష్టంగా చెప్పనప్పటికీ, ఏదో రూపంలో అంత మేర ఆర్దిక సాయం అదనంగా వస్తే మంచిదే.బొగ్గు గనుల వేలంలో వచ్చిన డబ్బును కూడా రాష్టాల్రకు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. అదికారంలో ఉన్నాం కనుక అన్నీ తెలుసననే భావన తనలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గోవా నుంచి కశ్మీర్ వరకు బిజెపి విస్తరించిందని అన్నారు.గుజరాత్ లో తనకు బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన అన్నారు. తనకు అహభావం లేదని ఆయన చెప్పదలిచారు. తనను జైలులో వేయడానికి ఎంతగా ప్రయత్నించిందీ తనకు తెలుసన్నారు. కానీ తాను వాటి జోలికి వెళ్ల దల్చుకోలేదన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వాలు ఏర్పాటుచేశామని, దక్షిణాదిలోనూ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని మోదీ గుర్తుచేశారు. అయితే అధికారంలో ఉన్నాం.. అన్నీ తెలుసుననే భావన తనలో లేదని, అందరం కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని విపక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, పేదరికానికి వ్యతిరేకంగా పోరు సాగిద్దామని మోదీ విపక్షాలకు పిలుపునిచ్చారు.