ముస్లిం యువకులను ఉరితీసిన కేసులో ఐదుగురి అరెస్టు

2

లాతేహర్‌,మార్చి20(జనంసాక్షి):జార్ఖండ్‌లోని లాతేహర్‌ జిల్లాలో ఇద్దరు ముస్లింలను ఉరేసి చంపిన కేసులో ఐదుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పారిపోయారని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అనూప్‌ బర్తరారు తెలిపారు. పశువుల వ్యాపారులైన ఇద్దరు ముస్లింలను శుక్రవారం బాలూమఠ్‌ అటవీ ప్రాంతంలో దుండగులు చెట్టుకు వేలాడదీసి చంపిన విషయం తెలిసిందే. ఈ జంట హత్యలకు హిందూత్వ అతివాదులే కారణమని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనలకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జీ చేశారు. ఆ గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పుడు అరెస్టయినవారిలో గోవధకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ‘గోవు క్రాంతి మంచ్‌’కు చెందిన మైతిలేష్‌ప్రసాద్‌ సాహు ఉన్నాడు. 2013 నుంచి ఆ ప్రాంతంలో గోవధకు వ్యతిరేకంగా ఈ సంస్థ ప్రచారం నిర్వహిస్తున్నది. ప్రస్తుతం, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులను మోహరించి నిషేధాజ్ఞలు విధించారు. మృతుల శవాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు తమ పార్టీకి చెందిన నిజ నిర్ధారణ బృందం ఆదివారంనాడు ఆ ప్రాంతంలో పర్యటిస్తుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజేష్‌ ఠాకూర్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఠాకూర్‌ అన్నారు. ప్రస్తుతం, జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

మైనారిటీల హత్యకు సీపీఐ(ఎం) ఖండన

జార్ఖండ్‌లోని లతేహర్‌ జిల్లాలోని బాలుమఠ్‌లో ఇద్దరు ముస్లింలను హత్య చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. వీరు పశువుల వ్యాపారులని, పెద్ద మందతో సంతకు వెళుతుండగా వారిని అడ్డగించి, సవిూపంలోని చెట్టుకు ఉరి తీశారని, గో సంరక్షణ కార్యకర్తలమని చెప్పుకునేవారు ఈ దారుణానికి పాల్పడ్డారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. రాజధాని రాంచికి కేవలం వంద కిలోవిూటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఈ ప్రాంతంలో ముసింలైన పశువుల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదని, స్థానికులు నిరసన వ్యక్తం చేసినా ఈ వ్యాపారంలో వుండే మైనారిటీలకు రక్షణ కల్పించడంలో పోలీసులు, ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించింది. హిందూత్వ శక్తులు సాగించే మతోన్మాద ప్రచారమే దీనికి కారణమని పేర్కొంది. వెంటనే దీనికి కారకులైన దోషులను అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని జార్ణండ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.