ముస్లిం రిజర్వేషన్ పేరుతో మోసం
– షబ్బీర్ అలీ
హైదరాబాద్,ఏప్రిల్ 6(జనంసాక్షి):ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మోసపూరితంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ… 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండదన్న నిబంధనలకు లోబడే కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా కేసీఆర్ దుర్బుద్దితో హావిూ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే కార్పొరేషన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులకు మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్‌ను షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేయలేదని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని షబ్బీర్‌అలీ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లోనే మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేశామని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌కు దమ్ముంటే 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు.