మూడోరోజు పార్లమెంటులో అదే వరుస
బొగ్గు కేటాయింపులపై దద్దరిల్లిన పార్లమెంట్
ఉభయసభలు నేటికి వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 23 : ప్రధాన ప్రతిపక్షం బిజెపి ఒత్తిడికి ఎట్టిపరిస్థితుల్లోను తలవొగ్గద్దని, వారిపై ధీటుగా ఎదురుదాడికి దిగి ప్రభుత్వ వాదనను గట్టిన వినిపించాలని యుపిఎ ఛైర్ పర్సన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తమ ఎంపిలకు ఆదేశించారు. బొగ్గు గనుల కేటాయింపు అంశంపై ప్రధాని మన్మోహన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా పార్లమెంట్ ఉభయసభలకు అడ్డుతగులుతూ సంభింపచేస్తున్న బిజెపి వైఖరిని తిప్పి కొట్టాలని ఆమె ఆదేశించారు. ఇటీవల సభలో విపక్ష నేత ఎల్‌కె అద్వాని చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలోనే తొలిసారిగా తన అసహానాన్ని ప్రదర్శించిన సోనియా గాంధీ గురువారం కూడా అదే వైఖరిని కొనసాగస్తూ ముందుండి ఎంపిలకు మార్గదర్శనం చేశారు. దీంతో అధికారపక్ష సభ్యులలో మరింత ఉత్సాహం కనబడింది. బొగ్గు కేటాయింపుల కుంభకోణం వరుసగా మూడో రోజైన గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. కాగ్ నివేదికపై ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో ఉభయ సభలు పలుసార్లు వాయిదాలు పడిన అనంతరం కూడా విపక్షాల తమ పట్టు వీడకపోవడంతో రాజ్యసభ, లోక్‌సభ శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. బొగ్గు గనుల వ్యవహారంపై కాగ్ నివేదిక ప్రభుత్వాన్ని తప్పుపట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. లోక్‌సభ, రాజ్యసభలోను ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని బిజెపి పట్టుపడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకుంది.
ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేస్తున్న బిజెపి గురువారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే అదే ధోరణి కొనసాగించింది. విపక్ష సభ్యులు సభ మధ్యలోకి వచ్చి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు సభల్లో వివక్షాలు ప్రధాని మన్మోహన్ రాజీనామాకు పట్టుబట్టాయి. స్పీకర్ మీరాకుమార్ ఎంత సర్ధి చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. సభలో గందరగోల పరిస్థితి నెలకొనడంతో సభను మధ్నాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఛైర్మన్ అన్సారీ సభను వాయిదా వేశారు. వాయిదా పడిన అనంతరం తిరిగి ఉభయసభలు ప్రారంభమయ్యాయి. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో ఉభయసభలను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్యసభ సజావుగా సాగేందుకు వీలుగా అటు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా అన్ని పార్టీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చొరవ చూపాలని తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్‌ను కోరినట్టు తెలుస్తోంది.