మూతపడ్డ ఎరువుల దుకాణాలు

– రూ.400 కోట్ల అమ్మకాలకు బ్రేక్‌
ఏలూరు, జూన్‌ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం బంద్‌ పాటించారు. ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ ఆకస్మిక దాడులు, తనిఖీలను నిరసిస్తూ బంద్‌జరిగింది. ఫెర్టిలైజర్స్‌, డీలర్స్‌ అసోసియేషన్‌ బంద్‌ పిలుపునిచ్చాయి. దీనితో పలు జిల్లాలో ఎరువుల దుకాణాలను తాళాలు పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రమంతా 20వేల ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. సుమారు 400 కోట్ల రూపాయల అమ్మకాలకు బ్రేక్‌ పడింది. ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్‌ నిరోధానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి 14 మంది ఎరువుల డీలర్లను అరెస్టు చేశారు. వీరిపై కుట్ర, మోసగించడం వంటి క్రిమినల్‌ సెషన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని ఫెర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ తప్పుపడుతోంది.
ఇప్పటికే ముగ్గురు డీలర్లకు బెయిల్‌ మంజూరు కాగా, జైళ్లలో మగ్గుతున్నారని ఆర్థిక నేరాలు, హత్యలకు పాల్పడే నేరస్థులపై నమోదు చేసే తీవ్రమైన సెక్షన్లను ఎరువుల షాప్‌ డీలర్లపై నమోదు చేయడం అసంబద్ధమని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈతకోట తాతాజి అన్నారు. తాము విజిలెన్స్‌ దాడులకు వ్యతిరేకం కాదని, అక్రమాలకు పాల్పపడే వారిని చట్టపరంగా శిక్షించాలని అయితే ఈ వ్యవహారంలోనే ప్రభుత్వ విధానం సక్రమంగా లేదని విమర్శించారు. విజిలెన్స్‌ అధికారుల దాడులు చేసిన సందర్భంలో స్టాక్‌ రిజిస్టర్‌ లో నమోదు కన్నా అధికంగా ఉన్న ఎరువులను సీజ్‌ చేయవచ్చని కాని మొత్తం సరుకును సీజ్‌ చేయడం వల్ల డీలర్లు నష్టపోతున్నారని అన్నారు. ఈ విషయమై శనివారం
వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిని కలసి తమ డిమాండ్లపై ఒక వినతిపత్రాన్ని అందించారు. ముఖ్యమంత్రిని కలుసుకుంటామని కూడా ఆయన తెలిపారు. బంద్‌ కారణంగా ఎరువుల వ్యాపారంపై ఆధారపడిన 12లక్షల మంది కార్మికులు ఉపాధి కొల్పోయారు.