మూలల్లోకి వెళ్లకుంటే పరిష్కారమెలా దొరుకుతుంది?
మావోయిస్టుల సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. దేశ రాజధాని ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్ వేదికగా అంతర్గత భద్రతపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం ఇదే సంకేతాలిచ్చింది. మావోయిస్టులతో దేశ అంతర్గత భద్రతకు ముప్పుపొంచి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అనగా, ఆంధ్రప్రదేశ్ తరహాలో బలమైన గ్రేహౌండ్స్ బలగాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మావోయిస్టుల సమస్యను అదుపులోకి తెచ్చుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఉద్బోంధించారు. అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలకు మావోయిస్టుల సమస్య శాంతిభద్రతల సమస్యగానే కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు కారణాలు, ఎవరి పక్షాన వారు పోరాడుతున్నారు? అనే విషయాలు కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయరు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో మావోయిస్టుల సమస్యను సామాజిక, ఆర్థిక సమస్యగా ప్రకటించింది. అసమానతల్లోంచి ఉద్భవించిన ఉద్యమంగా అభివర్ణించింది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో మావోయిస్టులతో చర్చలు జరుపుతామని పేర్కొంది. మావోయిస్టులు దేశభక్తులని అప్పటి సీఎల్పీ పక్షనాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే మావోయిస్టులతో చర్చలకు సిద్ధపడ్డారు. అంతకన్నా ముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన వైఎస్ సర్కారు మావోయిస్టులను ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించడంతో చర్చల ప్రక్రియ అంతలోనే ఆగిపోయింది. ఆ తర్వాత వైఎస్ సర్కారు మావోయిస్టుల కార్యకలాపాలు అణచివేసేందుకు గ్రేహౌండ్స్‌ను, ఇంటెలిజెన్స్ విభాగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకుంది. అలా మావోయిస్టుల సమస్యకు పరిష్కారం దిశగా పడిన తొలి అడుగు అక్కడే ఆగిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ`2 ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టులతో దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ రెచ్చగొట్టే ప్రకటన చేసింది. మావోయిస్టులు దండకారణ్యం కేంద్రంగా యూపీఏ సర్కారుపై యుద్ధం చేస్తున్నారనే ప్రచారం పాలకపక్షాలు చేస్తున్నారు. దండకారణ్యంలో నిక్షిప్తమై ఉన్న అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీల నరమేధానికి పాల్పడుతోందంటూ మావోయిస్టు పార్టీ పేర్కొంటోంది. అడవిలో తప్ప జనారణ్యంలో బతకడం తెలియని వారిని నిర్వాసితులను చేసి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల సమస్యలను శాంతి భద్రతల సమస్యగా చూసే పాలకులు సాగించే ఎక్‌కౌంటర్‌లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఎన్నో మార్లు ఘాటుగా స్పందించింది. మన పిల్లల్ని మనమే చంపుకుంటామా అంటూ ప్రశ్నించింది. అయినా పాలకుల తీరులో మార్పు రాలేదు.
మావోయిస్టుల సమస్య అధ్యయనానికి ఐఏఎస్ అధికారి శంకరన్, మానవ హక్కుల నేత బాలగోపాల్, ప్రకాశ్‌సింగ్ నేతృత్వంలో వేసిన నిపుణుల కమిటీ పలు సూచనలు, సిఫార్సులు చేసింది. కానీ పాలకులు ఆ సూచనలేవి పట్టించుకోలేదు. అస్పృశ్యత 64 రకాలుగా ఉందని, ఆ వ్యవస్థ వేళ్లూనుకుపోవడం వల్లే మనుషుల్లో సమానత్వం సాధ్య పడటం లేదన్నారు. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, గిరిజనులకు అటవీ హక్కులు కల్పించాలని, భూగరిష్ట పరిమితి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇళ్లు లేని 80 లక్షల కుటుంబాలకు కనీసం ఐదు సెంట్ల భూమి, ఇంటి నిర్మాణానికి రుణాన్ని ఇవ్వాలని, నిరుపేదలు సాగుచేసుకుంటున్న భూములు క్రమబద్దీకరించి వారికి హక్కులు కల్పించాలని, గిరిజనుల భూములను గిరిజనేతరులకు కేటాయించడం రాజ్యాంగం ప్రకారం చెల్లదని తదితర సూచనలు చేసింది. పోలీసులు ప్రజలకు దూరమవడం వల్లనే నక్సల్స్ పేదవర్గాలకు దగ్గరయ్యారని, పోలీసులంటే భయం ఎక్కువగా ఉండటం వల్లనే సమస్య మరింత జఠిలమవుతుందని తమ నివేదికలో పేర్కొంది. ఇవేవి పరిష్కరించకుండా మావోయిస్టుల సమస్య పరిష్కారం కాదని పేర్కొంది. వారు నివేదిక సమర్పించి చాలాకాలమవుతున్నా ఇంత వరకూ అమలుకు ప్రయత్నించగా పోగా మావోయిస్టుల సమస్యను ఇప్పుడు దేశ అంతర్గత భద్రత సమస్యకు పెను సవాల్‌గా అభివర్ణించింది. ఈ దృక్పథాన్ని పాలకులు వీడకుంటే సమస్య మరింత జఠిలమవుతుందే తప్ప పరిష్కారం కాదు.