మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్సై సిద్ధయ్య

2

కన్నుమూసినట్టుగా ప్రకటించిన వైద్యులు

సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం

హైదరాబాద్‌,ఏప్రిల్‌7(జనంసాక్షి): మృత్యువుతో పోరాటంలో ఎస్‌ఐ సిద్దయ్య ఓడిపోయాడు. నాలుగురోజుల పాటు ఆస్పత్రిలో పోరాడిన సిద్దయ్య చివరకు మృత్యు ఒడిలోకి చేరారు. నల్లగొండ జిల్లా జానకిపురంలో ముష్కరులతో పోరాడిన… ఆత్మకూర్‌(ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య (29) మృత్యువుతో పోరాడి ఓడారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్‌ లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దాంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మరోవైపు సిద్ధయ్య మరణవార్త విని నల్లొండ జిల్లా పోలీసులను కూడా  కలచివేసింది. ఆయన మృతిపై తెలంగాణ సిఎం కెసిఆరన్‌ తీవ్రంగా కలత చెందారు. అత్యాధునిక వైద్యంతో అతను మృత్యుముఖం నుంచి బయటపడతారని భావించామన్నారు. కాగా దుండగుల కాల్పుల్లో  సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకు పోయిన విషయం తెలిసిందే. దాంతో 10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు ఆయనకు 3 శస్త్రచికిత్సలు చేసింది.  సుమారు 8 గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్‌ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు. అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్‌ చేసి ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాలను శుభ్రం చేసినా, కడుపులోని బుల్లెట్‌ వల్ల ప్రాణానికి ప్రమాదం లేక పోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను కూడా వదిలేశారు. దీంతో రెండురోజులుగా ఆయన శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోగా బిపి పూర్తిగా పడిపోయింది. ఆయన మృతి పోలీస్‌ వర్గాలను కూడా తీవ్రంగా కలచివేసింది. పోలీస్‌ కొలువుకోసం కలలుగని..: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతలచెర్వుకు చెందిన సిద్ధయ్య కుటుంబం ఇరవై ఏళ్ల క్రితమే మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. అక్కడే పదోతరగతి చదివిన సిద్ధయ్య వెంటనే పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించినా వయసు చాలలేదు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్‌, డిగ్రీ చదువుతూనే శిక్షణ తీసుకున్నారు. 2012 బ్యాచ్‌ ఎస్సైగా ఎంపికై నల్గొండ జిల్లా మోత్కూరులో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆత్మకూర్‌ (ఎం) ఎస్సైగా పనిచేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామేశ్వరానికి చెందిన ధరణీషతో గతేడాది వివాహమైంది. తన భార్య గర్భిణి అని, ప్రసవసమయం దగ్గరపడినందున ఇంటికి వెళతానని సిద్ధయ్య ఉన్నతాధికారులను కోరాడు. అయితే సూర్యాపేట ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సెలవు దొరకలేదు. చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే అతని భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. విధివైచిత్రం కాకపోతే బిడ్డను కూడా చూసుకోకుండానే సిద్దయ్య కన్నుమూశారు. సెంటిమెంట్‌తో పిల్లవాడి చేతిని తండ్రికి తాకించినా విధి బలీయంతో అతను కోలుకోలేదు. నల్లగొండ జిల్లా సూర్యాపేట కొత్త బస్టాండ్‌లోని ఓ బస్సులో తనిఖీలు చేస్తున్న పోలీసులపై దొంగలు కాల్పులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా కాల్పులకు పాల్పడ్డది దోపిడీ దొంగలు కాదని సివిూ ఉగ్రవాదులుగా పోలీసులు తేల్చారు. ఉగ్రవాదుల పట్టివేతకు జిల్లా వ్యాప్తంగా ముమ్మర గాలింపు చర్యలను చేపట్టిన పోలీసులు వారి ఆచూకీని మోత్కూరు మండలంలో కనుగొన్నారు. మోత్కూరు మండలంలోని జానకీపురం శివారులో ఉగ్రవాదులను చుట్టుముట్టారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌ , ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. కాగా ఎస్‌ఐ సిద్ధయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఎస్‌ఐ ఈ సాయంత్రం 4.06 నిమిషాలకు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సిఎం కెసిఆర్‌ కూడా సోమవారం ఆస్పత్రికి వచ్చి పరిశీలించి వెళ్లారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రభుత్వం ఆదేశించింది. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు.

సిద్దయ్యది వీరమరణం: సిఎం నివాళి

నల్లగొండ కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్ధయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సిద్ధయ్య ప్రాణాలకు తెగించి పోరాడారని,  ఆయనది వీరమరణమని కేసీఆర్‌ నివాళులు అర్పించారు. పోలీసుల అంకితభావానికి సిద్ధయ్య ప్రతీకని కేసీఆర్‌ పేర్కొన్నారు. నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది.  వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సిద్దయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు.అధికారిక లాంఛనాలతో సిద్దయ్య అంత్యక్రియలు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలీసులకే కాక సామాన్య పౌరులకు కూడా సిద్ధయ్య స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. పోలీసుల అంకితభావానికి ప్రతీకగా సిద్ధయ్య చిరకాలం నిలిచిపోతారని ప్రశంసించారు.