మెట్రో పనులు సకాలంలో పూర్తిచేస్తాం

3
– సభలో మంత్రి కేటీఆర్‌ సమాధానం

హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి):హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక చేపట్టిన మెట్రోపనులను సకాలంలో పూర్తి చేస్తామని మున్సిపల్‌ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.అంతకు ముందు  మజ్లిస్‌ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మధ్య ఆదివారం నాడు శాసన సభలో ఒకింత మాటల యుద్ధం కనిపించింది. మెట్రో పనుల వ్యవహారంలో ప్రభుత్వంపై అక్బరుద్దీన్‌, కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.ప్రశ్నోత్తరాల సమయంలో అక్బరుద్దీన్‌ మెట్రోపై పలు ప్రశ్నలు సంధించారు. మెట్రో పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుందని, ఎన్ని స్టేషన్లు రానున్నాయని, ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీలు ఎలా ఉంటాయని, పాతబస్తీలో అలైన్మెంటు ఎలా ఉందని ప్రశ్నల వర్షం కురిపించారు. మెట్రోకు ఎంత సమయం పడుతుందో చెప్పలేదన్నారు. మెట్రో నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మెట్రో పనుల్లో పెద్ద కుంభకోణం జరుగుతోందన్నారు. తాము మెట్రోకు వ్యతిరేకం కాదని, కానీ అన్నింటి పైనా విచారణ జరగాలన్నారు. మెట్రోకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కెటిఆర్‌ స్పందించారు. పలు కోర్టు కేసులు అడ్డుగా ఉన్నందున మెట్రో పూర్తి కావడం ఆలస్యం కావచ్చన్నారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నందున ఒక్కో ముడినీ విప్పుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పటివరకూ 74 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వీలైనన్ని ఎక్కువ స్టేషన్లు ఉంటాయని, కొన్నిచోట్ల ఒక కిలోవిూటరు లోపే రెండు స్టేషన్లు ఉన్నాయన్నారు. ప్రపంచంలో దాదాపు 200 నగరాల్లో మెట్రోలు ఉండగా, కేవలం నాలుగు మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నాయన్నారు. చార్జీలపై ఇప్పటికింకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. మెట్రో పనులను ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నామని చెప్పారు. 2010 సెప్టెంబర్‌ నెలలో మెట్రో ఒప్పందం జరిగిందన్నారు. మెట్రోకు దాదాపు 2000 పిల్లర్లు పూర్తి చేశామని చెప్పారు. మెట్రోలో అలైన్‌ మెంట్‌ మార్పులు చేయలేదన్నారు. గత రెండేళ్లుగా మెట్రో పనుల్లో పురోగతి లేదన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక కదలిక ప్రారంభమైందన్నారు. మెట్రోలను అనుకున్న సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేస్తామన్నారు. మెట్రో అలైన్మెంట్‌ మార్చాలనుకున్నది అవాస్తవమన్నారు. అలైన్మెంటులో మార్పులు లేవన్నారు. మెట్రో విషయమై పాతబస్తీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతామని చెప్పారు. కాంట్రాక్టర్లను మార్చుతున్నామన్నది వాస్తవం కాదన్నారు. మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14వేల కోట్లకు పైగా ఉందన్నారు. బెంగళూరులో ఆరు కిలో విూటర్ల మెట్రో పూర్తవ్వడానికి ఏడేళ్లు పట్టిందని, ఢిల్లీలో 25 కిలోవిూటర్లు పూర్తి చేయడానికి ఏడున్నర సంవత్సరాలు పట్టిందని, చెన్నైలో ఎనిమిది కిలోవిూటర్ల పనులు జరగడానికి ఆరేళ్లు పట్టిందన్నారు. హైదరాబాద్‌లో 72 కిలోవిూటర్లు పనులు పూర్తవ్వడానికి ఎంత కాలం పట్టాలని ప్రశ్నించారు.

తన జన్మదినాన్ని పురస్కరించుకుని తండ్రి కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకుంటున్న నిజామాబాద్‌ ఎంపీ కవిత