మోడీకి సారథ్య బాధ్యతలిచ్చి దేశాన్ని ఏం చేద్దామని?
భారతీయ జనతాపార్టీ 2014 ఎన్నికల సారథ్య బాధ్యతలు గుజరాత్ ముఖ్యమంత్రికి నరేంద్రమోడీకి కట్టబెట్టి కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లుగా చెప్పుకుంటోంది. కార్పొరేట్ మోజులో పడి కొట్టుకుపోయే మీడియా కూడా ఈ ప్రచారానికి మంచి ప్రాచుర్యమే కల్పిస్తోంది. మోడీ 13 ఏళ్ల పాలనలో గుజరాత్ సర్వతోముఖాభివృద్ధి సాధించిందంటూ పత్రికల్లో పేజీలకు పేజీలు అడ్వర్టైజ్‌మెంట్లు, చానెళ్లలో యాడ్స్ ఇచ్చి ఆకట్టుకున్న మోడీ మోజులో పడి మీడియా కొట్టుకుపోవడం సహజమే. యూపీఏ రెండు పర్యాయాలు అధికారంలో ఉండటం, యూపీఏ-2 పాలనలో పేట్రేగిపోయిన అవినీతి, అక్రమాలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతాయని ఆశతో బీజేపీ ఉంది. బీజేపీ ఆశపడటంలో తప్పులేదు కూడా. యూపీఏ సర్కారుపై వ్యతిరేకతతో పాటు నరేంద్రమోడీ హిందుత్వ అతివాదాన్ని ట్రంప్‌కార్డుగా ఉపయోగించుకొని బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విలూరుతోంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాల్చివేతకు ముందు, తర్వాత పరిణామాలు తెలిసిన వారెవ్వరూ మోడీని సెక్యులర్‌గా అంగీకరించరు. ఆ విషయం బీజేపీకీ తెలుసు. భారతీయ జనతా పార్టీ మూలాలే హిందుత్వ వాదంతో ముడిపడి ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సంఘ్ పరివార్ శక్తులు బీజేపీని నియంత్రిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోవా రాజధాని పనాజీలో బీజేపీ మూడు రోజుల పాటు నిర్వహించిన పదాధికారుల సమావేశంలో నరేంద్రమోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ప్రకటించారు. బీజేపీకి రెండుసార్లు అధికారం అందడంలో అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ కీలక పాత్ర పోషించారు. ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన రథయాత్ర బీజేపీకి అధికార పీఠాన్ని చేరువ చేసింది. అలాంటి అద్వానీ పదాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టడానికి కారణం నరేంద్రమోడీకి బీజేపీ కల్పిస్తున్న అధిక ప్రచారం. నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలనేది ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అద్వానీని కూడా పక్కన బెట్టింది ఆర్‌ఎస్‌ఎస్. అద్వానీ ఒక్కరే కాదు ఆయన వర్గమంతా పదాధికారుల సమావేశానికి డుమ్మా కొట్టినా లక్ష్యపెట్టకుండా సమావేశాల చివరి రోజు నరేంద్రమోడీకి ఎన్నికల సారథ్య బాధ్యతలు కట్టబెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్ మోడీని వెన్నుతట్టి ప్రోత్సహించింది. మోడీకి సారథ్య బాధ్యతలు కట్టబెట్టిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన అద్వానీ అనారోగ్యంతోనే సమావేశానికి హాజరుకాలేకపోయానని ప్రకటించాడు.
సమావేశంలో పాల్గొనలేకపోవడంపై విచారం వ్యక్తం చేయడమే కాదు క్షమాపణ కూడా చెప్పాడు. మొదట్లో అతివాదిగా పేరున్న అద్వానీ తర్వాత తర్వాత సెక్యులర్‌వాదిగా మారిపోయాడు. అలాంటి అద్వానీని వెనక్కు తగ్గేలా చేయగలిగన ఆర్‌ఎస్‌ఎస్ రేపటి ఎన్నికల్లో బీజేపీ గెలుపొంది నరేంద్రమోడీ ప్రధాని అయితే అతడిని మాత్రం స్వతంత్రంగా పనిచేసుకోనిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నరేంద్రమోడీ అధికార పీఠంపై కూర్చొని పాలితులైన ప్రజలపై సాగించిన మారణహోమం ఎప్పటికీ కళ్ల ముందు నుంచి చెరిగిపోవు. గోద్రా అల్లర్లలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇప్పటికీ పత్తాలేకుండా పోయిన వారి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు బీజేపీ దగ్గరే సమాధానాలు లేవు. ఓ గర్భిణి గర్భాన్ని చీల్చి పిండాన్ని బయటకు తీసి మంటల్లో కాల్చి చంపిన అమానవీయ ఘటనను తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. గుజరాత్‌లో మోడీ మూడు పర్యాయాలు అధికారంలోకి రావడానికి గోద్రా ఘటన ఎంతగానో దోహద పడిందని బీజేపీ లెక్కకట్టుకుంది. ఇప్పుడు అదే లెక్క దేశవ్యాప్తంగా కలిసి వచ్చి అధికారం అందివస్తుందనేది బీజేపీ ఆశ. బీజేపీ ఆ ఆశతోనే శాంతిసామరస్యాలకు నిలయమైన భారత్‌ను మతతత్వ రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తోందా? అందుకే మోడీని ట్రంప్‌కార్డ్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటుందా? అదే నిజమైన సెక్యులర్ దేశమైన భారత్‌ను ఏమి చేద్దామని బీజేపీ ఉద్దేశం. ఒక రాజకీయ పార్టీగా ఎవరిని ఏ స్థానంలోనైనా కూర్చోబెట్టుకునే అధికారం ఉంటుంది. ఆ స్థానాన్ని ఆమోదించాల్సింది అంతిమంగా ప్రజలే. కానీ బీజేపీ నరేంద్రమోడీని ముందుకు తీసుకువచ్చిన సందర్భం వేరు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందువుల అస్తిత్వానికి ఏదో జరిగిపోతుందనే ప్రచారాన్ని కల్పించి తద్వారా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్యం కానేరదు. బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటే లౌకికంగానే పోరాడాలి. అతివాదాన్ని, మతవాదాన్ని రెచ్చగొట్టి దాని నుంచి లబ్ధిపొందాలనుకోవడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. ఇప్పుడు బీజేపీనే దేశ ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది, మోడీని ప్రమోట్ చేసి దేశాన్నంతా గుజరాత్‌గా మార్చాలనుకుంటుందా? లేక లౌకికవాదానికే చిరునామాగా ఉన్న భారత్‌ను ఇలాగే ఉండనిస్తుందా? ఇలాంటి సందర్భంలో ప్రజాస్వామ్యవాదులూ గొంతు విప్పాలి.