మోడీ గుజరాతీలకే ప్రతినిధి!

భారతీయ జనతా పార్టీ భావి ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకువస్తున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన చర్యల ద్వారా అదెంతమాత్రం నిజం కాదని నిరూపిస్తున్నాడు. తాను ఎప్పటికీ గుజరాతీలకు మాత్రమే ప్రతినిధిని అని చెప్పుకునే ప్రయత్నం ఉత్తరాఖండ్‌లో సంభవించిన పెను ప్రళయం సాక్షిగా చాటిచెప్పాడు. నరేంద్రమోడీ తనకు తాను జాతీయవాదినని చెప్పుకుంటాడు. ఆయన్ను ప్రమోట్‌ చేయడమే పనిగా పెట్టుకున్న విశ్వహిందూ పరిషత్‌, భగరంగదళ్‌, భారతీయ జనతా పార్టీలు అవకాశం వచ్చిన ప్రతిసారి మోడీని జాతీయవాదిగా అభివర్ణిస్తుంటాయి. మోడీ నిజంగా జాతీయవాదే అయితే ఉత్తరాఖండ్‌లో పెను ప్రళయం సృష్టించిన బీభత్సానికి కాక వికలకమైన ప్రజలందరినీ ఎందుకు పట్టించుకోలేదు. వరుణుడి ఆహ్రానికి వంతపాడిన గంగా దాని ఉప నదులు సృష్టించిన విధ్వంసం వర్ణించడానికి మాటలు చాలవు. ఉన్నట్టుండి కట్టలు తెంచుకున్న జల ప్రవాహం ధాటికి పెద్ద పెద్ద భవంతులు, పటిష్టమైన రోడ్లు, ప్రణాళికబద్ధంగా నిర్మించిన వంతెనలకే దిక్కు లేకుండా పోయింది. అలాంటి జలప్రళయం ధాటికి మనుషులో లెక్కా? ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన లక్షలాది మంది యాత్రికుల్లో ఇప్పటి వరకూ లక్ష మంది క్షేమంగా గమ్య స్థానాలకు చేరినట్లుగా అధికారులు చెప్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెయ్యిగా చెప్తుండగా, ఉత్తరాఖండ్‌ శాసనసభ స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ కుంజ్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ పది వేలకు పైబడే ప్రళయంలో మృత్యువాతపడ్డారని చెప్పారు. తాను ప్రత్యక్షంగా పలు ప్రాంతాలను సందర్శించి ఈ అంచనాకు వచ్చానని చెప్పాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంఖ్యను నిర్ధారించడానికి సిద్ధంగా లేవు. కానీ ప్రభుత్వం చెప్తున్నట్టుగా వెయ్యి మంది మాత్రమే మృత్యువాతపడలేదు. ఆదివారం నాటికి మూడు వేల మంది యాత్రికుల జాడ తెలియట్లేదని, వారంతా గల్లంతైనట్లేనని ఉత్తరాఖండ్‌ అధికార వర్గాలు వెల్లడిరచాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో యాత్రికులు చిక్కుకుంటే భావి ప్రధానిగా బీజేపీ చెప్తున్న నరేంద్రమోడీ ఏం చేయాలి? బాధితులందరికీ బాసటగా నిలవాలి. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి ఆత్మీయులను కోల్పోయిన భారతీయులందరికీ అండగా ఉంటానని చెప్పే ప్రయత్నమైనా చేయాలి. వారి కన్నీళ్లు తుడవాలి. ధైర్యం చెప్పి, వెన్ను తట్టి తిరిగిరాని వారిని జ్ఞాపకంగా మార్చుకొని జీవనయానం సాగించమని ప్రోత్సాహాన్ని అందించాలి. వీటిలో ఒక్కటంటే ఒక్క దాన్ని మోడీ పాటించలేదు. ఉత్తరాఖండ్‌ వరద ప్రవాహంలో బోట్‌లో ప్రయాణించి గుజరాతీలను మాత్రమే క్షేమంగా డెహ్రాడూన్‌కు చేర్చి అక్కడి నుంచి రైళ్లద్వారా సొంత రాష్ట్రానికి తీసుకుపోయాడు. తన వాళ్లను ముందుకు స్వస్థలానికి చేర్చాననే క్రెడిట్‌ కొట్టేసేందుకు కనీసం వాళ్లను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో బోగీల పరిస్థితి ఎలా ఉందో కూడా చూసుకోలేదు. పెను ప్రళయంలోంచి ప్రాణాలతో బయటపడి అనారోగ్యం, ఆందోళనతో బెంబేలెత్తుతున్న వారిని కనీసం ఫ్యాన్లు, లైట్లు లేని రైలు బోగీల్లో తరలించారు. వారికి సరైన ఆహారం కూడా అందించకుండా స్వరాష్ట్రానికి త్వరగా చేర్చాలనే లక్ష్యంతోనే పనిచేశారు. మోడీ గుజరాత్‌ బాధితుల తరలింపుపై హైటెక్‌ ప్రచారం చేసుకోగా యాత్రికులు మాత్రం ఆయన నియంతృత్వ ధోరణిపై తీవ్ర స్వరంతోనే మండిపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డ వారిని కనీసం విమానాల్లో కాకుండా పనికి రాని రైలు బోగిల్లో కుక్కి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తరలింపు ద్వారా ప్రచారం పొందాలనే తప్ప మోడీకి తమ ప్రాణాలు, ఆరోగ్యంపై ఎంతమాత్రం శ్రద్ధ లేకుండాపోయిందని ఆరోపించారు. కానీ మోడీ అవేవి పట్టించుకోకుండా సోషల్‌ మీడియా ద్వారా తాను చేసుకున్న ఘన కార్యాన్ని ప్రచారానికి పెట్టుకొని ప్రమోట్‌ చేయించుకుంటున్నారు. ఇదే సమయంలో మోడీని యావత్‌ దేశం ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. మోడీ జాతీయవాదే అయితే ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న బాధితులందరినీ అలాగే వదిలేని తన రాష్ట్రం వారిని మాత్రమే ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించాడు? జాతీయవాదం అంటే గుజరాతీలకు మాత్రమే సేవచేయడం, వారిని మాత్రమే ఆదుకోవడమా? దానినెలా జాతీయవాదంగా పేర్కొంటారు. ముమ్మాటికీ ప్రాంతీయవాదం కదా? ఇలాంటి ప్రశ్నలు దేశ ప్రజలంతా సంధిస్తున్నా సమాధానం చెప్పే ధైర్యం బీజేపీగానీ, నరేంద్రమోడీగాని చేయడం లేదు. ఎందుకంటే వాళ్ల దగ్గర సమాధానం లేదు. సహాయక చర్యలు చేపట్టడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని చెప్పేందుకే మోడీని గుజరాతీల తరలింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. గుజరాతీలందరినీ గమ్య స్థానాలకు చేర్చాక ఉత్తరాఖండ్‌ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వ్యక్తిని ఎలా జాతీయవాదిగా అంగీకరిస్తాం. ఎలా జాతీయవాదిగా ఆమోదిస్తాం? మోడీ ఎప్పటికీ జాతీయవాది కాదని ఉత్తరాఖండ్‌ బీభత్సం సాక్షిగా ఆయనే చాటుకున్నారు. స్వతహాగా మతతత్వవాది అయిన మోడీని జాతీయవాదిగా చెప్పడమే తప్పన్నట్టుగా ఆయన వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని బీజేపీ భావి ప్రధానిగా ప్రచారం చేస్తోంది. ఆపదలో ఉన్న ప్రజలను ప్రళయ ప్రాంతంలో వదిలేసిన వ్యక్తి దేశ ప్రజలందరినీ ఒకేలా ఎలా చూస్తారు? వారికి ఎలా భరోసా ఇవ్వగలుగుతారు? దేశాన్నంతటినీ ఒకేలా చూస్తానని ఎలా చెప్పగలుగుతారు? ఈ ప్రశ్నలకు బీజేపీ కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి కాబట్టి తన రాష్ట్రం వారిని మాత్రమే కాపాడుకుంటాడని, ఆయన అందరికీ సేవలందించడానికి అధికార ప్రతిబంధకాలున్నాయని బీజేపీ అడ్డంగా వదనకు దిగవచ్చు.. కానీ మంచిపని చేయడానికి అధికారమే అవసరం లేదు. మోడీకి తాను గుజరాతీల పక్షపాతిని, గుజరాత్‌ ప్రాంతీయవాదినని చెప్పుకోవడమే ఇష్టం అనే రీతిలో ఆయన వ్యవహారశైలి ఉంది. అలాంటి వ్యక్తిని ప్రజలంతా ఎలా భావి ప్రధానిగా అంగీకరించాలి? పీఠాన్ని ఆశిస్తున్న వ్యక్తులు గిరిగీసుకొని ఉంటే అదే పదివేలు అనుకునే విశాల దృక్పథం ప్రజలకు ఉండాల్సిన అవసరం లేదు. మోడీ విషయంలోనూ దేశ ప్రజలందరూ అదే వైఖరి అనుసరించకమానరు. ఎందుకంటే ఆయనే ఒక ప్రాంతీయవాదినని చెప్పుకున్నాడు. అలాంటప్పుడు ప్రజలకు ఆయన్ను జాతీయవాదిగా చూడాల్సిన అవసరం లేదు.