మోదీ సర్కారు కార్పొరేట్ రాబందుల వైపేనా.!
యూపీఏ పదేళ్ల వరుస పాలనపై దేశ జనమంతా పీకలదాకా అసహనం వెల్లడిస్తున్న రోజులవి. అవినీతి పెచ్చరిల్లి కుంభకోణాలమయంగా మారిన కాంగ్రెస్ నేతృత్వ యూపీఏ రాజ్యాధికారంపై దేశవ్యాప్తంగా ఛీత్కారాలు వెల్లువెత్తుతున్న తరుణమది. ఇదే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షపార్టీ బీజేపీ నేతలు 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార ఆర్భాటాల్లో మంచి రోజులు వస్తున్నాయన్నరు. భారత దేశం అంతా నమో నమో అనిపించారు. నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లి 30 యేళ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీ స్థానాల్లో గెలుపొంది బీజేపీ రికార్డు విజయం నమోదు చేసింది. ఇక దేశ ప్రజలంతా మంచిరోజులు వచ్చినయనుకున్నరు కానీ ఆ సంబరం కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది. గద్దెనెక్కిన తర్వాత ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో, అధికార అహంకారంతో ఆదిలోనే విశ్వాసం కోల్పోయింది మోదీ సర్కార్. ఫలితం కేంద్రంలో సర్కారు ఏర్పరిచిన 8నెలలకే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడం. దీనికి నిదర్శనమే హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఆమ్‌ఆద్మీ చేతిలో ఘోరపరాజయం. అయినా తీరు మారట్లేదు. అవినీతిని పెంచిపోషించిందన్న అపవాదు మూటగట్టుకున్నా… యూపీఏ సర్కారు కొన్ని ప్రజోపయోగ చట్టాల్ని తెచ్చిందన్నది మాత్రం కాదనలేని సత్యం. ఈ కోవలోనిదే యూపీఏ పోతూపోతూ చేసిన భూ సేకరణ చట్టం. సుదీర్ఘ పోరాటాల అనంతరం సాధించుకున్న భూసేకరణ చట్టం 2013 ఫలితాలు క్షేత్రస్థాయికి అందకుండానే యూపీఏ ప్రభుత్వం గద్దెదిగింది. మంచిరోజులు వస్తున్నాయంటూ జనాన్ని ఊదరగొట్టి గద్దెనెక్కిన మోడీ సర్కారు యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన భూసేకరణ చట్టాన్ని మారుస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. 2013లో సమగ్ర చట్టం వచ్చేవరకు ప్రజాహితం అంటూ నేతలకు తోచిన విధంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములను ఇష్టారాజ్యంగా రైతులు, అనగారిన వర్గాల నుండి లాక్కున్నారు. కనీస నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రజాప్రయోజనాల కోసమే అంటూ యధేచ్చగా భూముల ఆక్రమణలు చేపట్టి పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిన ఘటనలు కోకొల్లలు. తత్ఫలితంగానే భూసేకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు జరిగినయి. ఈ నేపధ్యంలో యూపీఏ2 తెచ్చిన చట్టమే 2013 భూసేకరణ చట్టం. దీనిప్రకారం భూసేకరణ ప్రక్రియలో నిర్వాసితులను భాగస్వాములను చేసి, పూర్తి పారదర్శకంగా, జవాబుదారితనంతో, సరైన పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలి. ఇక ఈ చట్టం ప్రకారం బహుళ పంటలు పండే భూముల్ని సాధ్యమైనంత వరకు సేకరణ నించి మినహాయించి తద్వారా ఆహారభద్రత కల్పించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు పెద్దయెత్తున ఆమోదం తెెలపడాన్ని తప్పనిసరి చేయడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే సంస్థల కోసం భూసేకరణ చేపట్టినప్పుడు 70 శాతం ఆమోదం తప్పనిసరి చేయటం, కేవలం ప్రైవేటు సంస్థల కోసం సేకరణ అయితే 80 శాతం మంది నిర్వాసితులు ఆమోదం తెెలిపేలా చర్యలు తీసుకోవడం వంటి పక్కా నిబంధనల్ని ఈ చట్టంలో పొందుపరిచారు. యూపీఏ తెచ్చిన చట్టంలో భూసేకరణకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డ అధికారులుంటే వారిని శిక్షించటం కోసం నిబంధనలున్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ సహా అన్ని పార్టీలు ఢంకా భజాయించాయి. నాటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ నేతలు ఓ అడుగు ముందుకేసి ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉపన్యాసాలిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అధికారంలోకొచ్చిన బీజేపీ భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఉద్ధేశ్యం బడాబాబులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ దిగ్గజాలకు భూములను అప్పనంగా కట్టబెట్టడమేననేది బహిరంగ రహస్యం. మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న మోదీ ఇలాంటి ఆర్డినెన్స్‌ల ద్వారా కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను కాలరాసే ప్రయత్నంచేస్తున్నారు. మోదీ సర్కారు ఆర్డినెన్స్ ప్రకారం ఐదు రంగాలకు భూసేకరణ చేపట్టినప్పుడు సామాజిక అనుమతి లేకుండానే నిర్వాసితుల అభిప్రాయం అవసరం లేకుండానే… భూ సేకరణ చేయొచ్చు. అంటే మినహాయింపబడిన 5 రంగాల్లో జాతీయ భద్రత-రక్షణ ఉత్పత్తి, గ్రామీణ మౌళిక వసతులు, విద్యుదీకరణ, పారిశ్రామిక వాడలు, గృహకల్పన తదితర రంగాలకు భూసేకరణ చేపట్టాల్సివస్తే అందుకు నిర్వాసితుల అనుమతి అవసరంలేదని మోదీ ఆర్డినెన్స్ చెప్తోంది. దీన్నిబట్టే ఆర్డినెన్స్ వెనక ఉన్న కుట్ర అర్థంచేసుకోవచ్చు. ఈ నెపంతో ప్రభుత్వాలు ఇప్పటికే అప్పనంగా బహుళజాతి కంపెనీలకు లక్షల ఎకరాల భూమిని ధారాదత్తం చేసిన సంఘటనలు చూస్తునేఉన్నార. భూసేకరణ చట్టం-2013 నిర్వాసితులకు కల్పిస్తున్న ఎన్నో హక్కులను ఈ ఆర్డినెన్స్ కాలరాస్తున్నది. ఈ ఆర్డినెన్సులో కంపెనీ అన్న పదాన్ని సంస్థ అని మార్చటం ద్వారా గతంలో జరిగిన భూదోపిడీని తిరిగి కొనసాగించటానికి మార్గం సుగమమైందనేది స్పష్టమవుతోంది. యూపీఏ తెచ్చిన చట్టంలో అధికార దుర్వినియోగం చేసిన అధికారులను శిక్షించే అవకాశం ఉండగా, బీజేపీ మోదీ సర్కారు ఆర్డినెన్సు దానికి పూర్తి విరుద్ధంగా అధికారిపై చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. దీనివల్ల అధికారుల్లో అవినీతి పెరిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఏ రకంగా చూసినా భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ తెచ్చిన ఆర్డినెన్సు ప్రజాహితంకంటే ప్రజలకు కీడు చేసేందుకే అన్నది స్పష్టమవుతున్నది. ఇలాంటి నేపథ్యంలో విపక్షాలు, ప్రజాసంఘాలన్నీ ఏకమై సంఘటితంగా పోరాడాల్సిన అవసరమున్నది. రైతులు, నిర్వాసితుల ఆమోదం లేనిదే భూసేకరణ చేపట్టకుండా ఆర్డినెన్సు రద్దు చేసే వరకు పోరాడాలి. అప్పుడే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పరని గుర్తుంచుకోవాలి. 70 శాతం సేద్యంపై ఆధారపడిన వ్యవసాయ దేశంలో రైతులను నిర్లక్ష్యం చేస్తే, వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. పేద రైతలు పట్ల,అనగారిన వర్గాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మోదీ సర్కారు భూసేకరణ చట్టాన్ని మార్చకుండా ఆర్డినెన్సును వెనక్కితీసుకోవాలి. భూసేకరణ చట్టంలో 50 తప్పులున్నాయంటున్న విత్తమంత్రి అరుణ్‌జైట్లీ వాటిపై సమగ్ర వివరణ ఇవ్వాలి. నిజంగా పొరపాట్లు ఉంటే పారదర్శకంగా వ్యవహరించి తప్పులను జనం ముందించాలి. తద్వారా మెరుగైన రీతిలో విధానం రూపొందిస్తే అందరూ ఆమోదిస్తారు అంతేకానీ కుంటిసాకులు చెప్పి తప్పించుకోవాలని చూడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాగ్రహం దావానలంలా వ్యాపించకముందే మేలుకుంటే సర్కారుకు మంచిది. లేకుంటే ప్రజాగ్రహానికి బలికాక తప్పదు. నిర్వాసితుల ఆమోదం లేనిదే భూమిని సేకరించటం ప్రజాస్యామ్యంలో ప్రజల హక్కులను కాలరాయటమే అవుతుందని ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్డినెన్సుపై వెనక్కి తగ్గేది లేదని బీజేపీ సర్కారు మొండికేస్తున్నది. తమ ఆర్డినెన్సును చట్టం చేసితీరతామని ప్రధానమంత్రి మోదీ భీష్మప్రతిష్ట చేస్తున్నడు. దీన్నిబట్టి మోదీ సర్కారు ఎవరి పక్షం వహిస్తున్నదో అర్థంచేసుకోవచ్చు. మంచి రోజులు తెస్తున్నామంటూ గద్దెనెక్కిన మోదీ సర్కారు పెద్దలు కార్పొరేట్ల కొమ్ముకాస్తుండటం విస్మయం కలిగిస్తోంది. తాము తెస్తామన్న మంచిరోజులు కార్పొరేట్లకేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే లాంటి వాళ్లు సైతం భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వేయవహరిస్తోంది. ప్రజాభీష్టాన్ని బేఖాతరు చేస్తూ తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. ప్రజా బాహుళ్యంలో పెద్దయెత్తున భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆందోళనలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా మేల్కొని భూసేకరణ చట్టానికి సవరణలు చేయకుండా బడ్డెట్ సమావేశాలు సాఫీగా సాగేలా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరముంది.