మోదీ హుందాగా మాట్లాడు!

2
కోల్‌కటా,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజార్చే విధంగా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాన మంత్రి పదవిలో ఉండి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆయన చేస్తోన్న వ్యాఖ్యలు సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడ్డారు.  రాష్టాన్న్రి మమత  బారి నుంచి కాపాడాలంటూ ప్రధాని మోదీ తనపై చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని సభ జరిగిన ప్రాంగణం వేదికగానే ఆమె బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే భయానక్‌ జైల్‌ పార్టీ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనకుతానే పోటీ అని అన్నారు. ఎవరిముందూ తలవంచని మనస్తత్వం తనదని తెలిపారు. ‘ఏ కారణంగా అయినా ప్రధాని నన్ను అరెస్టు చేయవచ్చు. కానీ నేను ఆయన ముందు తలవంచి పశ్చిమబెంగాల్‌ బిడ్డగౌరవాన్ని దిగజార్చను’ అంటూ మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం చాలా సులభమనీ, అయితే వాటిని చేతల్లో చూపడం మోదీకి చేతకాదని ఆమె ఎద్దేవాచేశారు. ఓ స్వయం సేవక్‌ శాఖ వర్కర్‌లా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ నిర్వహిస్తున్న మన్‌ కీ బాత్‌లో దైవం మాత్రమే ఆయన నిజమైన మనస్సును తెలుసుకోగలరన్నారు.